న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ ముందు ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పతకం ఆశలు పెట్టుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చీలమండ గాయంతో మెగా గేమ్స్‌కు దూరమయ్యాడు. లుసానే డైమండ్ లీగ్ తర్వాత శిక్షణ సమయంలో చీలమండ కండరాల లిగమెంట్ చీరుకుపోయిందని నీరజ్ శనివారం వెల్లడించాడు. ఫలితంగా గేమ్స్‌తో పాటు సీజన్ మొత్తానికి అతను దూరంగా ఉండనున్నాడు. ‘కఠోర శ్రమ తర్వాత లుసానే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చూపెట్టా. ఇక ఫామ్‌లోకి వచ్చానని భావిస్తున్న తరుణంలోనే ట్రెయినింగ్‌లో చీలమండకు గాయమైంది. వైద్యులు, ఇతర కోచ్‌లతో చర్చించిన తర్వాత గేమ్స్‌తో పాటు మిగతా సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాం. లయ అందుకుంటున్న తరుణంలో ఈ గాయం కావడం నిరాశను కలిగించింది. ప్రస్తుతానికి త్వరగా కోలుకోవడంపైనే దృష్టి పెట్టా’ అని నీరజ్ పేర్కొన్నాడు. ఈ గాయం కారణంగా వచ్చే నెల 5న బ్రస్సెల్‌లో జరగాల్సిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌కూ నీరజ్ దూరం కానున్నాడు.
