బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో బ్యాటింగ్‌లో విఫలమైన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీసి ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అప్పటివరకు ఒక బ్యాటర్‌గానే చూసిన వైభవ్‌లో మంచి బౌలర్ కూడా ఉన్నాడని ఎవరూ గుర్తించలేదు. కీలక టైమ్‌లో ఈస్ట్ జోన్‌కు వికెట్ అవసరమైన దశలో కెప్టెన్ ఇషాన్ కిషన్.. వైభవ్ చేతికి బాల్ ఇచ్చాడు. అంతే మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ‘బ్యాటర్ ఎవరైనా సరే బౌలింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు. అలాగే బౌలర్లూ బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇద్దరూ ఒకరి పాత్రను మరొకరు పోషించడాన్ని చాలా ఆస్వాదిస్తారు. నార్త్ జోన్ జట్టు వికెట్లు పడకపోవడంతో నన్ను 2, 3 ఓవర్లు వేయమని ఇషాన్ భయ్యా అడిగాడు. నన్ను బౌలింగ్ చేయమని అడగడంలో కొంత రిస్క్ ఉందని కూడా భావించాడు.
కానీ నేను వికెట్లు తీయగల బౌలర్‌నని అతనికి తెలియదు. నా మనసులో ఉన్న ఏకైక విషయం ఏంటంటే ఇక్కడ ఐదు వికెట్లు తీసినా నాకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి నా అత్యుతమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించా. ఒకే ప్రదేశంలో బాల్స్ వేస్తూ నా స్పెల్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నించా’ అని వైభవ్ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో ఫెయిలైన తాను బౌలింగ్‌ను చాలా ఆస్వాదించానని చెప్పాడు. ఒక రెగ్యులర్ బ్యాటర్ బౌలింగ్‌లో వికెట్ తీయడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదన్నాడు. మరోవైపు ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వెచ్చిస్తానని వైభవ్ ప్రకటించాడు. పాఠశాల, కళాశాల చదువులకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి సాయంగా ఉంటానని, తనకు తోచిన రీతిలో మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు.
