యువ క్రికెటర్లకు అండగా నిలుస్తాం: ఆర్థిక అంతరాలు తొలగించాలి.. కార్పొరేట్‌ సంస్థలకు బీసీసీఐ పిలుపు

యువ క్రికెటర్లకు అండగా నిలుస్తాం: ఆర్థిక అంతరాలు తొలగించాలి.. కార్పొరేట్‌ సంస్థలకు బీసీసీఐ పిలుపు

యువ క్రీడాకారులలో ఉన్న ఆర్థిక అంతరాలను తొలగించి, వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు కెరీర్ భద్రతను అందించాల్సిన బాధ్యత కార్పొరేట్ సంస్థలపై ఉందని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్ర మాజీ కెప్టెన్ వి.చాముండేశ్వరినాథ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని లక్డికపూల్‌లో టీజీ26 టోర్నీ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు ట్రూజన్ సోలార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి యువ ప్లేయర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

11 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో గ్రాండ్ విక్టరీ: 

బీసీసీఐ సహకారంతో తొలిసారిగా తెలంగాణలో నిర్వహించిన టీజీ26 టోర్నీలో హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. మైదానంలో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని ముద్దాడిన విజేత జట్టు సభ్యులను ట్రూజన్ సోలార్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా, విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు రాబోయే మూడేళ్ల పాటు టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగడానికి కూడా ట్రూజన్ సోలార్ నిర్ణయించిందని చాముండేశ్వరినాథ్‌ వెల్లడించారు.

తెలుగు క్రీడాకారులకు ఫుల్ సపోర్ట్: ట్రూజన్ సోలార్ ఎండీ 

భవిష్యత్తులో కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా ఇతర క్రీడలకు కూడా తమ సంస్థ తరఫున మరింత ప్రోత్సాహం అందిస్తామని ట్రూజన్ సోలార్ పవర్ ఎండీ సీహెచ్. భవాని సురేష్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తూ, వారి క్రీడా స్వప్నాలు నెరవేరడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.