బెంగళూరు: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. ఆదివారం నుంచి జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెంట్రల్ జోన్.. ఈస్ట్ జోన్‌తో తలపడనుంది. రజత్ పటీదార్ సారథ్యంలోని సెంట్రల్ జోన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్, మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌ల్లో రాణించిన పటీదార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వైస్ కెప్టెన్ రింకూ సింగ్ కూడా బ్యాట్ ఝుళిపించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది విజయం సాధించిన సెంట్రల్ జట్టు తమ కోర్ ఆటగాళ్లను కొనసాగించడం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో సారాన్ష్ జైన్, హర్ష్ దూబే స్పిన్ బౌలింగ్‌పై భారీ అంచనాలున్నాయి. యశ్ ఠాకూర్ పేస్ బాధ్యతలను మోయనున్నాడు. మరోవైపు నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచి ఊపుమీదున్న ఈస్ట్ జోన్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. క్వార్టర్స్‌లో బెంగాల్ బ్యాటర్లు సుదీప్ ఘరామీ, షాబాజ్ అహ్మద్ శతకాలతో రాణించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్, అభిమన్యు ఈశ్వరన్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. క్వార్టర్‌ఫైనల్లో నిరాశపర్చిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టీ నెలకొంది. బౌలింగ్‌లో అనుకూల్ రాయ్, అభిజిత్ సర్కార్ నిలకడగా రాణించడం కలిసొచ్చే అంశం.
సౌత్ జోన్ X నార్త్ జోన్
రెండో సెమీస్‌లో సౌత్ జోన్.. నార్త్ జోన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కొత్త కెప్టెన్ తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్ అన్ని అంశాల్లో పటిష్టంగా ఉంది. రికీ భుయ్, నారాయణ్ జగదీశన్, కరుణ్ నాయర్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. శ్రేయస్ గోపాల్, తనయ్ త్యాగరాజన్ స్పిన్ బాధ్యతలను పంచుకోనుండగా, విద్వత్ కావేరప్ప పేస్ దళానికి అండగా నిలవనున్నాడు. ఇక స్టార్ ప్లేయర్లతో కూడిన వెస్ట్ జోన్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో నార్త్ జోన్ సెమీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అబిద్ ముస్తాక్ పెర్ఫామెన్స్‌పైనే నార్త్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఆయుష్ బదోనీ, అబ్దుల్ సమద్, అన్షుల్ కాంబోజ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలకం కానున్నారు. గుర్నూర్ బ్రార్ చేరికతో నార్త్ జట్టు పేస్ విభాగం మరింత బలోపేతమైంది.
