అక్టోబర్ లోగా రీ సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

అక్టోబర్ లోగా రీ సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 
  • లైసెన్స్డ్ సర్వేయర్లు ఆలస్యం చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిక 
  • పేదలకు రూ. 230 కే ఇందిరమ్మ సిమెంట్ బస్తా ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు

సూర్యాపేట, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన భూముల రీ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అక్టోబర్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నుంచి రెండో విడత సర్వేకు సిద్ధం కావాలన్నారు. శనివారం సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖల అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

విధులకు సరిగ్గా రాని లైసెన్స్డ్ సర్వేయర్లను అవసరమైతే వెంటనే తొలగించి, వారి లైసెన్సులు రద్దు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో మార్పు రావాలన్నారు. భూములకు సంబంధించిన 45 దరఖాస్తులను తన లాగిన్‌లోనే ఎక్కువ రోజులు ఉంచుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు తహసీల్దార్‌ను వివరణ కోరాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు.  

పేదలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు వీలుగా పన్నులు, రవాణా ఛార్జీలన్నీ కలుపుకుని కేవలం రూ. 230 కే సిమెంట్ బస్తా ఇచ్చేలా సిమెంట్ కంపెనీలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యలను వెంటనే సరిచేయాలన్నారు.  అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను గుర్తించి దసరా లోపు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. 

నల్గొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ కింద 500 గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మొదటి విడతలో మిగిలిపోయిన ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని దసరా లోపే పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. 

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.  అనంతరం సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.  

కార్యక్రమంలో  రెవెన్యూ సీసీఎల్ఏ సెక్రటరీ లోకేశ్ కుమార్, ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, నల్గొండ, సూర్యాపేట. యాదాద్రి  కలెక్టర్లు బి. చంద్రశేఖర్, తేజస్ దలాల్ పవర్, అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.