- 50 వాహనాల్లో వెళ్లిన ఆడే గజేందర్ వర్గం
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పై నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. గజేందర్ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నేరడిగొండతోపాటు పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 50 వాహనాల్లో శనివారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేశ్ గౌడ్‌ను ఆడే గజేందర్ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు.
నరేశ్ జాదవ్ పార్టీలో అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిని, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన తరుణంలో కొందరు నాయకుల తీరు వల్ల సమన్వయం దెబ్బతింటోందని గజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే శ్రేణులు, స్థానిక నాయకుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలని.. అందరినీ కలుపుకొనిపోయే నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
