Lionel Messi Event: గతేడాది డిసెంబర్ 13, 2025న యువ భారతి స్టేడియంలో జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్‌లో తలెత్తిన తీవ్ర గందరగోళం, నిర్వాహకుల వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నబన్నాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆ ఈవెంట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న 33,000 మంది అభిమానులకు రూ.4,000, రూ.6,000 చొప్పున కొనుగోలు చేసిన టికెట్ డబ్బులను రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే అభిమానులకు రీఫండ్ అందిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాల వల్ల క్రీడారంగం ధ్వంసం:
గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సువేందు అధికారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రీడాకారుల నియామక పత్రాలకు సంబంధించిన ఫైళ్లు గత ముఖ్యమంత్రి కార్యాలయంలో 11 ఏళ్లుగా ధూళి పడుతూ మూలనపడి ఉన్నాయని ఆరోపించారు. ఒడిశా, జార్ఖండ్ లాంటి పొరుగు రాష్ట్రాలు ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌లో సత్తా చాటుతుంటే.. బెంగాల్ ప్రాతినిధ్యం శూన్యంగా మారిందని వాపోయారు. రాష్ట్రంలో అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, సరైన సిస్టమ్, పటిష్టమైన రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, క్రీడా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అంతమొందిస్తామని స్పష్టం చేశారు.
రూ.400 కోట్ల బడ్జెట్.. 100 కొత్త ఇండోర్ స్టేడియంలు:
రాష్ట్రంలో క్రీడారంగాన్ని పునరుద్ధరించేందుకు రాబోయే 8 నెలల కాలానికి గాను రూ.400 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు సీఎమ్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్‌లతో కూడిన మినీ ఇండోర్ స్టేడియంలను నిర్మిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి ఏడాదే 100 స్టేడియంల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు:
హాకీ విజార్డ్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా నబన్నాలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ హాకీ క్రీడాకారుడు గుర్బక్ష్ సింగ్, క్రీడా శాఖ మంత్రి ఇంద్రాణిల్ ఖాన్, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబే తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికగా పలువురు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఘనంగా సత్కరించడంతో పాటు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
