చీమల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా..?  ఈ గిరిజన రుచి చాలా కాస్ట్లీ బాసు..!

చీమల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా..?  ఈ గిరిజన రుచి చాలా కాస్ట్లీ బాసు..!

తరతరాలుగా గిరిజనుల ఆహార సంస్కృతిలో భాగమైన ‘ఎర్ర నేత చీమల పచ్చడి’ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఒడిశాలో ‘కాయ్ చట్నీ’గా ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయ వంటకానికి జీఐ ట్యాగ్‌ రావడంతో దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. ఒకప్పుడు అడవికే పరిమితమైన ఈ గిరిజన రుచి.. నేడు నగరాల ఖరీదైన రెస్టారెంట్లలోనూ ప్రత్యేక వంటకంగా చోటు సంపాదిస్తోంది.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని గిరిజన సమాజాలు తరతరాలుగా ‘ఎర్ర నేత చీమల’తో పచ్చడి చేసుకుని తింటున్నారు. ఒడిశాలో ‘కాయ్ చట్నీ’గా పిలిచే ఈ వంటకానికి ఇటీవల ప్రతిష్టాత్మక ‘భౌగోళిక గుర్తింపు’ (జీఐ ట్యాగ్) లభించింది. దాంతో ఇది గౌర్మేగా మారింది. “గౌర్మే” (Gourmet) అంటే అత్యంత నాణ్యమైన, ప్రత్యేకమైన, అరుదైన పదార్థాలతో తయారుచేసే విలాసవంతమైన లేదా ప్రత్యేక రుచుల ఆహారం అని అర్థం. అడవిలో దొరికే ఈ చీమలు, వాటి గుడ్లను సేకరించి, మిరపకాయలు, ఉప్పు, అల్లంతో కలిపి రోట్లో నూరి ఈ సాంప్రదాయ పచ్చడిని తయారు చేస్తారు. 

ఇది కేవలం రుచి కోసమే కాదు, అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఇందులో ప్రొటీన్, ఇనుము, కాల్షియం, జింక్, విటమిన్ – బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గిరిజనులు దీనిని జలుబు, దగ్గు తగ్గించే ఒక శక్తివంతమైన సాంప్రదాయ ఔషధంగా, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంగా నమ్ముతారు. ఒకప్పుడు అడవికే పరిమితమైన ఈ వంటకం, ఇప్పుడు ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలలో ఖరీదైన రెస్టారెంట్లకు చేరింది. 

ప్రముఖ చెఫ్‌లు దీనిని వింతగా చూడకుండా.. ఇందులో ఉండే సహజసిద్ధమైన ఫార్మిక్ యాసిడ్ ఇచ్చే పుల్లదనం, ప్రత్యేకమైన ‘ఉమామి’ రుచి కోసం తమ ఆధునిక వంటకాలు, సాస్‌లు, సలాడ్లలో ఒక ప్రీమియం పదార్థంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కీటకాల ఆహారం వైపు అడుగులు వేస్తుంటే, భారతీయ గిరిజన రుచి మాత్రం శతాబ్దాలు దాటి నేడు గ్లోబల్ గౌర్మే ప్లేటుపై సగర్వంగా నిలుస్తోంది.