WTC Final Race: శ్రీలంకతో జరిగిన కొలంబో టెస్టు చివరి రోజున లంక బ్యాటర్లు పట్టుదలగా నిలబడటంతో వైట్‌వాష్ సాధించాలనే భారత్ ఆశలకు గండి పడింది. ఈ సిరీస్‌ను భారత్ 1–0తో కైవసం చేసుకున్నప్పటికీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోనే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో టీమిండియా విజయావకాశాల శాతం (PCT) 53.33 నుంచి 51.52కి పడిపోయింది.
WTC ఫైనల్ రేసు: భారత్ ముందున్న సమీకరణాలు:
జూన్ 9, 2027న ప్రారంభమయ్యే WTC ఫైనల్‌కు అర్హత సాధించడం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇప్పుడు మరింత సవాలుగా మారింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మాత్రమే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తాయి కాబట్టి, ఇండియన్ టీమ్ మరో మూడు స్థానాలు ఎగబాకాల్సి ఉంది. ప్రస్తుతం ఈ WTC సైకిల్‌లో భారత్‌కు ఇంకా 7 టెస్టులే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో వారి స్వదేశంలో 2 టెస్టులు, వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ ఏడింటిలో ఏడు మ్యాచ్‌లూ గెలిస్తే భారత పీసీటీ 70.37కి చేరి టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆరు మ్యాచ్‌లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. అంతకంటే తక్కువ గెలిస్తే ఫైనల్ ఆశలు దాదాపు గాలిలో దీపమే అవుతాయి.
పాయింట్ల పట్టికలో టాప్ టీమ్స్ పరిస్థితి ఇదే:
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 2వ స్థానంలో, న్యూజిలాండ్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ల ఫైనల్ ఆశలు దాదాపు ముగిసిపోగా, టాప్-5లో ఉన్న జట్లకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, 2025 ఫైనల్ మాదిరిగానే మళ్లీ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లే 2027 ఫైనల్లో తలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, 2021లో తొలి ఎడిషన్‌ను న్యూజిలాండ్ గెలవగా, 2023లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక 2025 విజేతగా దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. భారత్ మొదటి రెండు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కమ్‌బ్యాక్ ఇచ్చి ఫైనల్ బెర్త్ సాధిస్తుందా?:
2024లో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో, 2025లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన వైట్‌వాష్ పరాజయాలు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి. కానీ న్యూజిలాండ్‌ను వారి స్వదేశంలో ఓడించి, ఆ తర్వాత నంబర్ 1 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాపై స్వదేశంలో గెలిస్తేనే టీమిండియా మళ్లీ రేసులోకి వస్తుంది. మరి భారత్ పుంజుకుని ఫైనల్లో కివీస్, ఆసీస్ లేదా సఫారీ జట్టుతో తలపడనుంది.
