రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్
  • ఇంటింటికీ ఇంకుడుగుంత, ప్రతి పొలంలో ఫామ్​పాండ్ తప్పనిసరి 

ఎల్కతుర్తి, వెలుగు: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం, దండేపల్లి, వీరనారాయణపూర్, వల్బాపూర్, ఇందిరానగర్ లో శనివారం ‘పల్లెపల్లెకూ పొన్నమన్న, పల్లెపల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. 

వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేశారు. హుజూరాబాద్ – హనుమకొండ వయా సూరారం బస్సు సర్వీసును, పలు అభివృద్ధి పనులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెల్లో పెండింగ్‌‌‌‌‌‌‌‌ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎల్ నినో నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. 

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్  సాగుతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత, పొలంలో ఫాం పాండ్  తవ్వుకోవాలన్నారు. 15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్  నివారణ టీకాలు వేయించాలన్నారు. తన తండ్రి పేరు సత్తయ్యకు బదులుగా సత్యనారాయణ నమోదైందని, దీంతో తనకు కూడా సర్​ నోటీసులు వచ్చాయని తెలిపారు. అర్హత కలిగిన వారు తమ ఓటు పోకుండా చూసుకోవాలని సూచించారు. 

అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందించే బాధ్యత తనదేనన్నారు. అడిషనల్​ కలెక్టర్ శేషాద్రి, జడ్పీ సీఈవో గురవయ్య, డీఆర్డీవో మేన శ్రీను, సర్పంచులు భాషబోయిన నీల కొమురయ్య, గొలిపెల్లి సంపత్, పుల్లూరి శ్రీధర్ రావు, పొనగంటి శ్వేత- శ్రీనివాసరావు, అంబాల రాజ్ కుమార్, విద్యుత్  ఏడీ వంశీకృష్ణ, ఏడీఏ ఆదిరెడ్డి పాల్గొన్నారు.