- ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో వేలాది మంది బాధితులు
- ఆరు నెలలుగా రూ.కోట్లలో పంట డబ్బులు పెండింగ్
- డబ్బులు ఇప్పించాలని మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లాలో మక్క రైతులు సీడ్ ఆర్గనైజర్ల చేతిలో చిక్కుకొని అల్లాడుతున్నారు. ఏపీలోని ప్రైవేట్ విత్తన కంపెనీలు సప్లై చేసిన ఆడ, మగ విత్తనాలు సాగు చేసిన రైతులు తమ పంటను సీడ్ ఆర్గనైజర్ల ద్వారా కంపెనీకి అప్పగించి నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ పంట డబ్బులు ఇవ్వలేదు. రెండు వారాల్లో బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి పంటను తీసుకున్న ఆయా కంపెనీల ప్రతినిధులు ఆరు నెలల నుంచి తిప్పించుకుంటున్నారు.
అధిక దిగుబడి వస్తుందని, ఎక్కువ రేటుకు పంటను తీసుకుంటామని సాగుకు ముందు మాయమాటలు చెప్పి ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో బాధిత రైతులు తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలంటూ ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఐదు కంపెనీలకు చెందిన సీడ్స్ సాగు చేసిన వెయ్యి మంది రైతులకు రూ.50 కోట్ల వరకు రావాల్సి ఉందని
అంటున్నారు.
అప్పులు చేసి తిప్పలు
ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏన్కూరు, బోనకల్, చింతకాని తదితర మండలాల్లో గతేడాది సీడ్ మక్కజొన్న పంటను పెద్దఎత్తున సాగు చేశారు. పంట తీసుకునే సమయంలో కొద్ది రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చి ముఖం చాటేశారు. పంట సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొందరు రైతులు భూములు కౌలుకు తీసుకొని, అప్పులు చేసి సాగు చేశారు. ఇప్పుడు ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, పెసర, ఇతర పంటలకు పెట్టుబడులు అవసరం కాగా, గత సీడ్ మక్కజొన్న పంట డబ్బులు అందక తిప్పలు పడుతున్నారు.
గత పంట డబ్బులు చేతికి రాకపోవడంతో కొత్త పంటకు పెట్టుబడులు పెట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఒకవైపు పాత అప్పులు, మరోవైపు కొత్త అప్పులు, వాటికి పెరుగుతున్న వడ్డీలు రైతులను ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నాయి. కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం, సిద్ధిక్‌నగర్, మేకలకుంట, తీగలబంజర, ఏన్కూరు మండలంలోని రేపల్లెవాడ గ్రామాలకు చెందిన రైతులు ఏలూరు ప్రాంతానికి చెందిన కంపెనీల సీడ్ మక్కజొన్న సాగు చేశారు. నాణ్యత, విత్తనం ఫెయిల్, డీఎన్‌ఏ పరీక్షల పేరుతో రకరకాల కారణాలు చెబుతూ డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫీసర్లు, నేతలు చుట్టూ ప్రదక్షిణలు..
రైతులు తమ పంట పొలాల్లో పనులు వదులుకొని పంట డబ్బుల కోసం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బకాయిల కోసం ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు.
మూడు రోజుల కింద ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి, కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులను కలిసి తమ సమస్యను వివరించారు. కంపెనీలు, ఆర్గనైజర్ల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే ఇప్పించి, డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
పనులు మానుకొని తిరుగుతున్నాం
నాకు ఎకరం సొంత భూమి ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఏఎన్ఎం కంపెనీకి చెందిన ఆడ మక్కజొన్న సాగు చేశాను. ఎకరానికి 40 క్వింటాళ్ల చొప్పున 200 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. రూ.6 లక్షలు రావాల్సి ఉండగా, రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు.
ఇంకా రూ.4 లక్షలకు పైగా రావాలి. కౌలు, పెట్టుబడులు కలిపి ఎకరాకు రూ.90 వేల వరకు ఖర్చు చేశాను. డబ్బుల కోసం పనులు మానేసి తిరగాల్సి వస్తోంది.
– పామర్తి బసవయ్య, సింగరాయపాలెం
పంట డబ్బులు ఇప్పించాలి
నేను ఎకరంలో ఆడ మక్కజొన్న సాగు చేశాను. 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఆర్గనైజర్‌కు అప్పగించాను. డబ్బుల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరగడమే పనిగా మారింది. పంట డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నాం. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాం. పంట డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. –భూక్యా సుమన్‌రావు, మేకలకుంట
