సెప్టెంబర్  రెండోవారంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. పోటీలో 8 నుంచి 10  సంఘాలు 

సెప్టెంబర్  రెండోవారంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. పోటీలో 8 నుంచి 10  సంఘాలు 
  • ఎన్నికల నిర్వహణ చర్యలు ముమ్మరం చేసిన కార్మిక శాఖ 
  • బస్సు స్టేషన్లలో, డిపోల్లో కార్మిక సంఘాల పోటాపోటీ ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దాదాపు దశాబ్దకాలం తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల రెండో వారంలో ఈ ఎన్నికలు జరగనుండగా.. నాలుగో వారంలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగానే ఎన్నికల ఏర్పాట్లపై ఆ శాఖ అధికారులు ముమ్మర చర్యలు ప్రారంభించారు. ఏయే కార్మిక సంఘాలకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందనే దానిపై కార్మిక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 

ఆయా కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్లు, అందులోని అసలైన సభ్యుల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, కౌటింగ్ వంటి ఎన్నికల ఏర్పాట్లలోని పలు దశలపై కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటున్నారు. 

ఎన్నికల్లో పోటీ చేసే సంఘాలివే..

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 8 నుంచి 10 సంఘాలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్, మరికొన్ని యూనియన్లు గుర్తింపు సంఘం కోసం ఎన్నికల బరిలో నిలిచేందుకు అప్పుడే సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు స్టేషన్లు, డిపోల్లో ఆయా కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 

పలు సంఘాలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ బస్సు స్టేషన్లు, డిపోల వారీగా కార్మికులతో సమావేశం అవుతున్నారు. కొత్తగా కమిటీలు వేస్తున్నారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కర పత్రాలు, వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను పంపిణీ చేస్తూ ...తమకు ఓటు వేస్తే కార్మికులకు ఏం చేస్తామనేది అందులో వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ఏ బస్సు స్టేషన్, ఏ డిపోలు చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. 

దశాబ్దం తర్వాత జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలతో కార్మికుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి కార్మికులు గుర్తింపు సంఘం హోదాను ఏ యూనియన్ కు కట్టబెడ్తారనే దానిపై ఆర్టీసీలోనే కాదు.. ఆయా  రాజకీయ పార్టీల నేతల్లో చర్చ సాగుతోంది.