హైదరాబాద్, వెలుగు: నకిలీ, నాసిరకం విత్తనాలతో నష్టపోయే రైతులకు వచ్చే సీజన్ నుంచి పరిహారం అందేలా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం సెక్రటేరియట్లో అధికారులతో విత్తన చట్టం–2025 డ్రాఫ్ట్ పై మంత్రి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణలో సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చినా, రాకపోయినా రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం కోసం గతంలో ఏర్పాటు చేసిన డ్రాఫ్ట్ కమిటీ రైతులు, విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు, డీలర్లు, అధికారులతో సంప్రదింపులు జరిపి పలు సూచనలు చేసిందని మంత్రి తెలిపారు. వాటి ఆధారంగా రాష్ట్ర విత్తన బిల్లు రూపొందించామని, దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలు, సూచనలు పంపి నెలలు గడిచినా విత్తన చట్టంపై ముందడుగు పడలేదన్నారు. ఇప్పటికే ఒక పంటకాలం గడిచినందున ఇక జాప్యం చేయడం సరికాదన్నారు.
కేంద్రం నుంచి అనుమతి లభించకపోయినా రాష్ట్ర బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతు–విత్తన కంపెనీల మధ్య పారదర్శక ఒప్పందాలు, విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయమైన ధర, నాణ్యమైన విత్తనాల సరఫరాకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలని చెప్పారు. నకిలీ, అనధికార విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు సీడ్ ట్రేసబిలిటీని పటిష్టం చేయడంతో పాటు రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన నేపథ్యంలో విత్తన రంగానికి బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరమన్నారు. అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, కో ఆపరేటివ్ కమిషనర్ రాహుల్రాజ్ పాల్గొన్నారు.
