ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల వివరాలు

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల వివరాలు
  •     అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం ఇచ్చిన హౌసింగ్‌‌‌‌ బోర్డు
  •     మరో నాలుగు సెగ్మెంట్లలో డ్రా పూర్తి 

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌‌‌‌లో ఫ్లాట్స్ దక్కించుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందుబాటులో ఉంచుతున్నామని హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ పేర్లపై అభ్యంతరాలు, ఫిర్యాదులను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో స్వీకరిస్తామని చెప్పారు. శనివారం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం లాటరీ ప్రక్రియ ఖైరతాబాద్, కూకుట్ పల్లి, బహదూర్ పుర, అంబర్ పేట నియోజకవర్గాల్లో పూర్తయింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో 1,920 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. 

అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం, సోమవారంతో మొత్తం 16 నియోజకవర్గాల్లో డ్రా పూర్తి కానుంది. లాటరీలో ఎంపికైన వారి వివరాలను అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని కమిషనర్ తెలిపారు. దరఖాస్తు స్వీకరణ సమయంలో ఎలాంటి ధ్రువపత్రాలను తీసుకోనందున, దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించుకునేందుకు ఈ పరిశీలన చేపడుతున్నామని ఆయన తెలిపారు. అర్హులైన వారికే ఇండ్ల కేటాయింపు జరగాలనే లక్ష్యంతో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎటువంటి అపోహలు అనుమానాలకు తావు లేదని కమిషనర్ గౌతమ్ స్పష్టం చేశారు. 

నేను రాకముందే డ్రా ఎలా తీస్తరు?: దానం

ఖైరతాబాద్ నియోజకవర్గ లాటరీ బంజారాహిల్స్‌‌‌‌లోని కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్‌‌‌‌లో జరిగింది. ఈ లాటరీకి ప్రొటోకాల్ పాటించలేదని హౌసింగ్ బోర్డు అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాకముందే డ్రా ఎలా స్టార్ట్ చేస్తారని ప్రశ్నించారు. పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో డ్రాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. తర్వాత డ్రా ముగించామని అధికారులు తెలిపారు.