- అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన చేపట్టాలని ఉద్యోగుల జేఏసీ పిలుపు
హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏల సాధనకై వచ్చే నెల 6న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉద్యోగుల సంకల్ప సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీలోని భాగస్వామ్య సంఘాలతో సమావేశం నిర్వహించారు.
ఇందులో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉద్యోగులు అందరు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
