- లేదంటే జనగణనను బహిష్కరించాలి: కంచ ఐలయ్య
- గాంధీ భవన్‌లో పీసీసీ బీసీ సెల్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో భాగంగా కుల గణన నిర్వహిస్తున్నప్పటికీ.. ఎస్సీ, ఎస్టీలను గుర్తించేందుకు ప్రత్యేక కాలమ్ ఉన్నట్లుగానే ఓబీసీలను గుర్తించేందుకు కూడా ప్రత్యేక కాలమ్ ఉండాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రం నిర్వహించే కుల గణనను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీ భవన్‌లో పీసీసీ బీసీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన కుల గణనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచె ఐలయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓబీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఓబీసీలకు కాంగ్రెస్, రాహుల్ గాంధీ అండగా నిలుస్తున్నారని, ఈ వర్గాల హక్కుల కోసం కేంద్రంపై పోరాడుతున్నారని చెప్పారు.
దేశంలో తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకు కుల గణన చేపట్టారని ఆయన తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని కేంద్రం నిర్వహించే కుల గణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ఓబీసీల జనాభా లెక్కలు తేలాల్సిందేనని అన్నారు. ఆ లెక్కలు లేకుండా ఓబీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఎలా దక్కుతాయని ప్రశ్నించారు. అందుకే కేంద్రం నిర్వహించే కుల గణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా ఉండాలని కంచె ఐలయ్య స్పష్టం చేశారు. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లో పది సభలు నిర్వహించాలని పీసీసీ ఓబీసీ సెల్ తీర్మానించింది. అవసరమైతే ఈ సభలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను వీలునుబట్టి ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేతలు మెట్టు సాయి, బొంతు రామ్మోహన్, సంగీతం శ్రీనివాస్, శ్యామ్ మోహన్ తదితర నేతలు పాల్గొన్నారు.
