సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బీజేపీ మహా దీక్ష.. 22ఏ రూల్స్ రద్దు కోరుతూ ఇందిరా పార్క్ దగ్గర నిరసన

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బీజేపీ మహా దీక్ష.. 22ఏ రూల్స్ రద్దు కోరుతూ ఇందిరా పార్క్ దగ్గర నిరసన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 22ఏ భూముల నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ భారీ దీక్ష చేపట్టనుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. శనివారం బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌​ఎన్.రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానంగా 22ఏ నిబంధనల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు తమ భూములపై హక్కులు కోల్పోతూ రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై కూడా రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌‌‌‌ బాబు, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి 
తదితరులు పాల్గొన్నారు.