- పారదర్శకత కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం
- పరీక్ష పేపర్లు సొంత స్కూల్ టీచర్లు దిద్దడానికి వీల్లేదు
- 3 నుంచి 5 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేయాలి
- ఒక్కో పేపరుకు రూ.2 నుంచి రూ.3 చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ 1, 2) పరీక్షల వాల్యువేషన్ విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆయా స్కూళ్లలో విద్యార్థులు రాసిన పేపర్లను అక్కడి టీచర్లే దిద్ది మార్కులు వేసే పద్ధతి ఉండగా.. ఇకపై దాన్ని రద్దు చేస్తూ ‘ఎక్స్‌టర్నల్ ఇవాల్యుయేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. పరీక్షల్లో పారదర్శకత, నిష్పాక్షికత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు రెండు సార్లు నిర్వహిస్తున్నారు.
ఎస్ఏ 1(ఆరునెలల పరీక్షలు) అక్టోబర్ 1 నుంచి 9 వరకూ జరగనున్నాయి. సమ్మెటివ్ అసెస్మెంట్ 2 (వార్షిక పరీక్షలు) వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 19 వరకు జరుగుతాయి. కాగా, గతంలో ఏ స్కూల్ పరీక్షలు.. అదే స్కూల్ సబ్జెక్టు టీచర్ వాల్యువేషన్ చేసి మార్కులు వేసేవారు. ఇక ఈ విధానానికి సర్కారు స్వస్తి చెప్పింది. కొత్త నిబంధనల ప్రకారం.. పరీక్షలు యధావిధిగా స్కూల్ స్థాయిలోనే హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో జరుగుతాయి. అయితే, పరీక్ష ముగిసిన వెంటనే ఆన్సర్ షీట్లను అదే రోజు ఎంఈఓకు అప్పగించాలి. అక్కడ ఎంపిక చేసిన మూల్యాంకన కేంద్రాల్లో ఈ పేపర్లను దిద్దిస్తారు. ఏ టీచర్ కూడా తన సొంత పాఠశాలకు చెందిన విద్యార్థుల పేపర్లను దిద్దడానికి వీల్లేదు. ఒక స్కూల్ విద్యార్థుల జవాబు పత్రాలను అదే మండలానికి చెందిన ఇతర స్కూల్ టీచర్లతో మూల్యాంకనం చేయిస్తారు.
దీంతో టీచర్లు తమ విద్యార్థులకు అనుకూలంగా మార్కులు వేసే అవకాశం ఉండదు. నిధుల కేటాయింపు ఇదీ..ఈ కొత్త విధానం అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా విడుదల చేసింది. మండల స్థాయిలో మూల్యాంకన కేంద్రాల నిర్వహణ కోసం ఒక్కో మండలానికి రూ. 10 వేల చొప్పున కేటాయించారు. ప్రైమరీ లెవల్ ఆన్సర్ షీట్లకు ఒక్కో దానికి రూ.2, హైస్కూల్ లెవల్ పేపర్లకు రూ.3 చొప్పున చెల్లిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో సుమారు రూ.5.57 కోట్లను రెండు విడతల (ఎస్ఏ1, ఎస్ఏ2) పరీక్షల కోసం అంచనా వేశారు. ప్రస్తుత విధానంలో కొన్నిచోట్ల టీచర్లు తమ స్కూల్ రిజల్ట్స్ మెరుగ్గా చూపించుకోవడానికి మార్కుల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త ఎక్స్‌టర్నల్ విధానంతో విద్యార్థుల సామర్థ్యం బయటపడుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
ఐదు రోజుల్లో మార్కుల ఎంట్రీ
మూల్యాంకన ప్రక్రియను అత్యంత వేగంగా 3 నుంచి 5 రోజుల్లోనే పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. మూల్యాంకనం పూర్తయిన వెంటనే మార్కులను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా విద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎక్కడా ఎటువంటి తప్పులు జరగకుండా, జవాబు పత్రాల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆఫీసర్లు హెచ్చరించారు.
