చెలరేగిన షెఫాలీ.. థాయ్‌లాండ్‌పై భారత్‌ ఘన విజయం

చెలరేగిన షెఫాలీ.. థాయ్‌లాండ్‌పై భారత్‌ ఘన విజయం

దుబాయ్‌‌: మహిళల ఆసియా కప్‌‌ టీ20లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. గ్రూప్‌‌-ఏలో భాగంగా ఆదివారం థాయ్‌‌లాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో భారత్‌‌ 94 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌‌ చేసిన భారత్‌‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి థాయ్‌‌లాండ్‌‌ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌‌తో షెఫాలీ వర్మ, బంతితో దీప్తి శర్మ, నందిని శర్మ అదరగొట్టారు. 

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన భారత్‌‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభం ఇచ్చారు. స్మృతి 19 పరుగులు చేసి రనౌట్‌‌గా వెనుదిరిగినా.. షెఫాలీ మాత్రం దూకుడు తగ్గించలేదు. 36 బంతుల్లోనే 64 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్‌‌ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, షెఫాలీ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్‌‌ ఒక్కసారిగా తడబడింది.

100/2తో ఉన్న జట్టు కొద్దిసేపటికే వరుస వికెట్లు కోల్పోయింది. థాయ్‌‌లాండ్‌‌ స్పిన్నర్‌‌ సులీపోర్న్‌‌ లావోమీ 3 వికెట్లు తీసి భారత మిడిలార్డర్‌‌ను ఇబ్బంది పెట్టింది. హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ 5 పరుగులకే ఔటైంది. రిచా ఘోష్‌‌ ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. దీప్తి శర్మ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌‌గా వెనుదిరిగింది.

చివర్లో క్రాంతి ఊరట

చివరలో బ్యాంటింగ్‎కు వచ్చిన క్రాంతి గౌడ్‌‌ 8 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఎన్‌‌ఆర్‌‌ శ్రీచరణి కూడా చివర్లో విలువైన పరుగులు జోడించడంతో భారత్‌‌ 20 ఓవర్లలో 159/9 స్కోరు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌‌లాండ్‌‌కు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా స్పిన్నర్లు మధ్య ఓవర్లలో మ్యాచ్‌‌ను పూర్తిగా భారత్‌‌ వైపు తిప్పేశారు. 

నందిని శర్మ, దీప్తి శర్మ చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు. శ్రీచరణి రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్‌‌ ఒక వికెట్‌‌ తీసింది. భారత బౌలర్ల ధాటికి థాయ్‌‌లాండ్‌‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. చివరకు 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో భారత్‌‌ 94 పరుగుల భారీ విజయం సాధించింది. గ్రూప్‌‌- ఏలో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అరంగేట్రంలో ప్రతీకా

గాయపడిన జెమీమా రోడ్రిగ్స్‌‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతీకా రావల్‌‌ ఈ మ్యాచ్‌‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌‌లో అరంగేట్రం చేసింది. నంబర్‌‌-3లో బ్యాటింగ్‌‌కు వచ్చిన ప్రతీక.. 18 బంతుల్లో 22 పరుగులు చేసింది. అయితే తన ఇన్నింగ్స్‌‌ను పెద్ద స్కోరుగా మలచలేకపోయింది. ఈ మ్యాచ్‌‌ దీప్తి శర్మకు ప్రత్యేకంగా నిలిచింది. ఆమె 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌‌ ఆడింది. హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌, స్మృతి మంధాన తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా క్రికెటర్‌‌గా నిలిచింది. అదే మ్యాచ్‌‌లో మూడు వికెట్లు తీసి ఈ మైలురాయిని ఘనంగా జరుపుకుంది.

బ్యాటింగ్‌‌పై ఫోకస్‌‌ అవసరం

భారత్‌‌ భారీ తేడాతో గెలిచినా.. బ్యాటింగ్‌‌లో వచ్చిన పతనం జట్టు మేనేజ్‌‌మెంట్‌‌కు ఆందోళన కలిగించే అంశమే. 100/2 నుంచి 137/9కు పడిపోవడం మిడిలార్డర్‌‌ వైఫల్యాన్ని చూపించింది. మరోవైపు బౌలింగ్‌‌ విభాగం మాత్రం అద్భుతంగా పనిచేసింది. 

స్కోర్లు..
భారత్‌‌: 159/9 (20 ఓవర్లు)
థాయ్‌‌లాండ్‌‌: 65 (16.1 ఓవర్లు)
ఫలితం: భారత్‌‌ 94 పరుగుల తేడాతో విజయం