- రూ.2 లక్షల రుణమాఫీ.. 72 వేల ఉద్యోగాలు
- తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే 91 శాతం అధికం
- రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు.. రూ.3.97 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. ప్రభుత్వ రోడ్‌మ్యాప్
హైదరాబాద్, వెలుగు: సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు1,000 రోజుల ప్రగతి నివేదికలో స్పష్టం చేసింది. గడిచిన 32 నెలల పాలనలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సాధించిన ఫలితాలపై ప్రభుత్వం సమగ్ర సమీక్షా నివేదికను విడుదల చేసింది. ‘‘రూ.1.68 లక్షల కోట్ల సాగు వ్యయం, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్‌తో వరి సేకరణలో పంజాబ్‌ను అధిగమించాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ ద్వారా క్షేత్రస్థాయికి సంక్షేమం చేరింది.
తొలి వెయ్యి రోజుల్లోనే 72 వేల ప్రభుత్వ కొలువులను భర్తీ చేశాం. స్కిల్స్ వర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా కుల సర్వే, 59 ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీలకు 42% కోటా బిల్లులతో సామాజిక న్యాయాన్ని అమలు చేశాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి పెరిగి జాతీయ సగటు కంటే 91% ముందంజలోఉంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ.3.97 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 355 జీసీసీలతో పారిశ్రామిక వృద్ధి నమోదైంది” అని ప్రభుత్వం వివరించింది. ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, నెట్-జీరో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులే భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాదులని పేర్కొంది.
సేద్యానికి గరిష్ట ప్రాధాన్యత..
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ 32 నెలల్లో రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రూ.2 లక్షల పంట రుణమాఫీ ద్వారా 25 లక్షలకు పైగా కుటుంబాలకు ఊరట కల్పించడంతో పాటు రూ.36 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు పేర్కొంది. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌తో పాటు గత యాసంగిలో రికార్డు స్థాయిలో 81.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది.
మహిళలకు 335 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించి రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా చేసినట్లు విశ్లేషించింది. గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లులు, 43 లక్షల లబ్ధిదారులకు రూ.500 గ్యాస్ సబ్సిడీని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. డ్వాక్రా సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంక్ రుణాలు, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీతో పాటు ఆర్టీసీ బస్సులు, బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి 3.38 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేపట్టినట్లు వివరించింది.
డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు..
డ్రగ్స్ కట్టడికి ‘ఈగల్’ విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ సేఫ్టీ కమిటీలను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. హైవేలు, ఓఆర్ఆర్‌పై ప్రమాదాల నివారణకు ‘టీజీ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ను నోటిఫై చేసినట్లు వెల్లడించింది. ఉద్యోగులకు1వ తేదీనే వేతనాలు, పెన్షనర్లకు రూ.600 కోట్ల బకాయిలు చెల్లించినట్టు స్పష్టం చేసింది. దేశంలోనే మొదటిసారిగా ‘టీజీడెక్స్’ ఏఐ డేటా ఎక్స్చేంజ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. 360 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు, 122.9 కి.మీ. పొడవున 7 కారిడార్లతో మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టామని పేర్కొంది.
మామునూరు ఎయిర్‌పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్ పనులను ముమ్మరం చేసింది. 55 కిలోమీటర్ల మేర నదీ తీర పునరుజ్జీవ ప్రాజెక్టు, 39 ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు పునాదులు వేసినట్లు తెలిపింది. క్యూర్, ప్యూర్, రేర్ రీజియన్లుగా విభజించి సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల సమతుల్య అభివృద్ధి చేపట్టినట్లు వివరించింది. ఈ సంస్కరణల ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల జీఎస్‌డీపీ లక్ష్యాన్ని సాధిస్తామని ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌లో విశ్లేషించింది.
ఏటీసీలుగా 122 ఐటీఐ, పాలిటెక్నిక్‌లు..
కొత్తగా 2.25 లక్షల పింఛన్లు మంజూరు చేయడం తో మొత్తం పింఛనుదారుల సంఖ్య 43 లక్షలకు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామంది. నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ టవర్ల నిర్మాణం, గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యతతో నివాస భరోసా కల్పిస్తున్నామని తెలిపింది. విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం 28వ స్థానం నుంచి 18వ ర్యాంకుకు పురోగమించగా, 105 సమీకృత గురుకుల స్కూళ్లను మంజూరు చేసినట్లు పేర్కొంది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ శిక్షణతో పాటు 122 ఐటీఐ, పాలిటెక్నిక్ కేంద్రాలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా ఆధునికీకరించినట్లు వివరించింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు సీఎం సహాయనిధి ద్వారా 5.18 లక్షల మందికి రూ.2,526 కోట్ల సాయం అందించినట్లు తెలిపింది. రూ.2,700 కోట్లతో నూతన ఉస్మానియా ఆసుపత్రి, అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్‌లలో 3 టిమ్స్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఆహార కల్తీ, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం లీగల్, ల్యాబ్ విభాగాలతో 'టీజీ సేఫ్' సంస్థను ఏర్పాటు చేసింది.
