తిమ్మాపూర్, వెలుగు: జిల్లా ఆటగాళ్లను జాతీయస్థాయిలో ఆడేలా చేస్తామని, వచ్చే రెండేండ్లలో అన్ని జిల్లాల నుంచి కనీసం ఐదుగురు ఆటగాళ్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయడమే తమ లక్ష్యమని భారత మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ ఆపరేషన్స్ కమిటీ సీవోసీ అధిపతి అంబటి రాయుడు అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నిర్మించిన వెలిచాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మన ఆటగాళ్లలో మంచి ప్రతిభ ఉందని, ప్రోత్సాహం అందిస్తే కచ్చితంగా దేశానికి ఆడే అవకాశం ఉందన్నారు.
ఆటగాళ్ల ఎంపికలో గతంలో హెచ్‌సీఏ చేసిన పొరపాట్లను సరిదిద్దుతున్నామని, పారదర్శకంగా సెలెక్షన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కనీసం పదెకరాల స్థలం కేటాయించి క్రికెట్‌కు ఆడేందుకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ చైర్మన్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి టి.శేషనారాయణ్, హెచ్‌సీఏ మహిళా క్రికెట్ అభివృద్ధి విభాగం అధిపతి సునీత ఆనంద్, కరీంనగర్ క్రికెట్అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.ఆగంరావు, హెచ్‌సీఏ సభ్యులు వెంకటేశ్వరరావు, వెంకట్‌రెడ్డి, మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
