గద్వాల రైల్వే స్టేషన్‌‌లో ప్రయాణికుల తిప్పలు.. అభివృద్ధి పనులు చేయాలి కానీ ఇలానా..?

గద్వాల రైల్వే స్టేషన్‌‌లో ప్రయాణికుల తిప్పలు.. అభివృద్ధి పనులు చేయాలి కానీ ఇలానా..?
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే స్టేషన్‌‌లో అభివృద్ధి పనులు
  • తాగునీరు, మరుగుదొడ్లు, టాయిలెట్లు లేక ఇబ్బందులు
  • గత నాలుగు నెలలుగా ఇదే దుస్థితి.. పట్టించుకోని అధికారులు

గద్వాల, వెలుగు: గద్వాల రైల్వే స్టేషన్‌‌లో అభివృద్ధి పనుల పేరిట కనీస సౌలతులు కల్పించకుండానే పనులు చేపట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా పాత టాయిలెట్లు, మరుగుదొడ్లు, క్యాంటీన్ బిల్డింగ్‌‌లను కూల్చివేశారు. 

సాధారణంగా పనులు చేసే ముందు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, రైల్వే శాఖ, కాంట్రాక్టర్లు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల నాలుగు నెలలుగా తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

భయాందోళనల మధ్య.. 
స్టేషన్ పరిసరాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో పురుషులతో పాటు మహిళా ప్రయాణికులు సైతం బయట ఉన్న కంపచెట్లలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో మహిళలు తీవ్ర భయాందోళనల మధ్య ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఒకవైపు తాగడానికి నీరు దొరక్క, మరోవైపు ప్రైవేట్‌‌గా వాటర్ బాటిల్స్ లేదా స్నాక్స్ కొనుగోలు చేయడానికి కనీసం క్యాంటీన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ షెడ్డుకు రోజువారీ కిరాయి రూ.7వేలుగా రైల్వే శాఖ నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాక అది కూడా మూతపడింది.

వాటర్ ట్యాప్‌‌ల్లో నీళ్లే రావట్లే..
స్టేషన్​లో అక్కడక్కడా ఏర్పాటు చేసిన నామమాత్రపు వాటర్ ట్యాప్‌‌ల్లో ఎప్పుడూ నీరు రావడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న ఈ పనుల వల్ల నెలల తరబడి తాము పడుతున్న కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి, తక్షణమే ప్రత్యామ్నాయంగా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సమస్యలపై ఆఫీసర్లకు నివేదిక ఇచ్చాం
రైల్వే స్టేషన్ లో పనులు జరుగుతుండడంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. టాయిలెట్స్, తాగునీరు ఏర్పాటు చేయాలని పై ఆఫీసర్లకు లేఖ రాశాం. క్యాంటీన్ తెరవకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాటు చేస్తున్నాం.

రైల్వే స్టేషన్ మేనేజర్, గద్వాల.