యాదాద్రి, వెలుగు: ఏటా రెండు సీజన్లలో రైతుల నుంచి ప్రభుత్వం రూ. వందల కోట్లు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు ప్రభుత్వం అప్పగిస్తోంది. గడువు మీద గడువు పెంచినా వడ్లను మరాడించి బియ్యం అప్పగించడంలో కొందరు మిల్లర్లు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కొందరు మిల్లర్లు ఈ వడ్లతోనే ఇతర బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక సీజన్ వడ్లను మరో సీజన్‌కు చూపిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విధంగా యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో మూడు సీజన్ల వడ్లు పేరుకొని పోయాయి.
మూడు సార్లు గడువు పెంచినా పెండింగే..
యాసంగి 2024-25 సీజన్లో జిల్లాలోని 50 మిల్లులకు సీఎంఆర్ కోసం 3,77,744 టన్నుల వడ్లను సివిల్‌సప్లయ్ అప్పగించింది. ఈ వడ్లను మరాడించి 2,55,499 టన్నులు బియ్యాన్ని సీఎంఆర్‌గా మిల్లర్లు అప్పగించాల్సిఉంది.
ఇప్పటికే మూడుమార్లు గడువు పొడిగించినా మిల్లర్లు పూర్తి స్థాయిలో బియ్యం అప్పగించలేదు. ఇంకా 28 వేల టన్నులు బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఇందులో నాలుగు వేల టన్నులు బాయిల్డ్, 24 వేల టన్నుల పచ్చి బియ్యం అప్పగించాల్సి ఉంది.
ఇందులో ఎక్కువగా భువనగిరిలోని యాదాద్రి మిల్లు 4,481 టన్నులు, రామన్నపేటలోని విద్య మిల్లు 4,368 టన్నులు, ఆలేరులోని మల్లికార్జున మిల్లు 4,316 టన్నులు, సోమేశ్వర మిల్లులో 4,239 టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉంది. మొత్తానికి ఈ మూడు సీజన్లు కలిపి మిల్లుల్లో 3.53 లక్షల టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది చివర్లో నాలుగో సీజన్ వడ్లు రానున్నాయి.
