నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతం: మూడ్రోజులు శిథిలాల కిందే ఆరేండ్ల పాప.. చిన్నారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది

నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతం:  మూడ్రోజులు శిథిలాల కిందే ఆరేండ్ల పాప.. చిన్నారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది

ఖాట్మాండు: తీవ్ర వరదలతో అతలాకుతలమవుతున్న నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతం చోటుచేసుకుంది. రసువా జిల్లాలో వరదలు ముంచెత్తిన మూడు రోజుల తర్వాత, శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరేండ్ల చిన్నారిని రెస్క్యూ బృందాలు శుక్రవారం ప్రాణాలతో కాపాడాయి. భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో రసువా జిల్లాలోని తిమురే గ్రామం తీవ్రంగా దెబ్బతింది. 

ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏపీఎఫ్) ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా, బురద కింద నుంచి చిన్నగా ఏడుపు శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఆ ప్రాంతాన్ని తవ్వి, పాపను సురక్షితంగా బయటకు తీశారు.

 ఆ వెంటనే చిన్నారికి తిమురేలోని ఏపీఎఫ్ సరిహద్దు అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖాట్మాండుకు తరలించాలని నిర్ణయించారు. శుక్రవారం ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణం సాధ్యపడలేదు.

 శనివారం మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నారిని ఖాట్మాండు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చిన్నారికి ప్రత్యేక వైద్య బృందం ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందిస్తోంది. సహాయక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. చిన్నారిని మనీషా మగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించామని, ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.