వరంగల్/ములుగు, వెలుగు: వీకెండ్ టూరిజం, పార్టీలకు ఓరుగల్లు కేరాఫ్‌గా మారింది. శని, ఆదివారాలు, పండుగ సెలవులు వచ్చాయంటే చాలు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పర్యాటకులు ఉమ్మడి వరంగల్ వైపు తరలివస్తున్నారు.
వాటర్‌ఫాల్స్, కొండల మధ్య సరస్సులు, వందల ఏండ్లనాటి చారిత్రక కట్టడాలు, ప్రముఖ ఆలయాలు, అభయారణ్యాలు ఒకే టూర్‌లో సందర్శించే అవకాశం ఉండటంతో ఓరుగల్లు వీకెండ్ టూర్లకు హాట్‌స్పాట్‌గా మారింది. ప్రస్తుతం వానాకాలం కావడంతో సీజనల్ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పోటీపడుతున్నారు.
తెలంగాణ నయాగారా బొగత..
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత వాటర్‌ఫాల్ తెలంగాణ నయాగారాగా గుర్తింపు పొందింది. వీకెండ్స్‌లో రోజుకు సుమారు 5 వేల నుంచి 10 వేల మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 123 కి.మీ, భద్రాచలం నుంచి 120 కి.మీ. దూరంలో ఉన్న బొగత వాటర్‌ఫాల్ పచ్చని ప్రకృతి అందాల మధ్య పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ములుగు జిల్లాలో మరో ఎనిమిది జలపాతాలు ఉన్నప్పటికీ రహదారి సౌకర్యాలు, వసతులు లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల కారణంగా వాటి సందర్శనకు అనుమతి లేదు. వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలోని ముత్యాలధార, దుస్సపాటిలొద్ది (కొంగల), మాషేనులొద్ది, ఏనుగుసరి, బావణిసరి, మహితాపురం, గుండం తదితర జలపాతాలు ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్నాయి.
మేడారం మొక్కులు.. లక్నవరం అందాలు
తాడ్వాయి అభయారణ్య పరిధిలోని ప్రకృతి అందాలు, సరస్సులు, చెరువులు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వీకెండ్స్‌లో వస్తున్నారు. వెంకటాపురం మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, పక్కనే ఉన్న రామప్ప చెరువు పర్యాటకులకు మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ ప్రాంతంలోని లక్నవరం సరస్సు కొండల మధ్య ప్రకృతి అందాలతో సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇక్కడ రాత్రి బస చేసేందుకు హరిత కాకతీయ హోటల్ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. తాడ్వాయి అటవీ ప్రాంతంలోని బ్లాక్‌బెర్రీ రిసార్ట్ కూడా సిటీ టూరిస్టులను ఆకర్షిస్తోంది.
సిటీలో.. వరంగల్ కోట, భద్రకాళి టెంపుల్
గ్రేటర్ వరంగల్‌లోనూ పలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు వీకెండ్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కాకతీయుల పాలనకు ప్రతీకలైన ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి వంటి చారిత్రక కట్టడాలు శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయి. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. భద్రకాళి బండ్, మ్యూజికల్ గార్డెన్ వంటి ప్రాంతాలు కూడా వీకెండ్ కోసమొచ్చే టూరిస్టులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
టూరిజం సర్క్యూట్‌గా.. ఓరుగల్లు
ఒకే జర్నీలో పదుల సంఖ్యలో పర్యాటక కేంద్రాలను సందర్శించే అవకాశం ఓరుగల్లు ప్రత్యేకత. వరంగల్ నగరంలో భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోట, మ్యూజికల్ గార్డెన్ ఉండగా.. ములుగు వైపు వెళ్తే రామప్ప, లక్నవరం, తాడ్వాయి అభయారణ్యం, మేడారం, బొగత, ముత్యాలధార వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. రాబోయే రోజుల్లో కర్రెగుట్టలను కూడా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో ఓరుగల్లు రాష్ట్రంలోనే ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా మారనున్నది.
