బీఅలర్ట్: తెలంగాణలో రాబోయే వారం రోజులు వర్షాలు.. సీజనల్ వ్యాధులపై ఆరోగ్యశాఖ వార్నింగ్ 

బీఅలర్ట్: తెలంగాణలో రాబోయే వారం రోజులు వర్షాలు.. సీజనల్ వ్యాధులపై ఆరోగ్యశాఖ వార్నింగ్ 

రాబోయే వారం రోజులు తెలంగాణలో  తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండి అంచనా వేసింది.  భారీ వర్షాలు లేనప్పటికీ మోస్తరు వర్షాలతో సీజన్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల సీజన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చని సూచించారు. 

హైదరాబాద్​:  రాబోయే వారం రోజులు తెలంగాణలో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి తేమ పెరగడంతో సీజనల్ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలని GHMC, ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. వారానికి ఒకసారి ఇళ్లలో కూలర్లు, నీటి ట్యాంకులు, పూల కుండీల్లో నిల్వ నీటిని పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయడం, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, డ్రైనేజీలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 

గత రెండేళ్లలో హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 2024లో నగరంలో 2వేల806 కేసులు, 2025లో 1,983 కేసులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య 266 కేసులు నమోదయ్యాయని GHMC గణాంకాలు చెబుతున్నాయి.

 ఇదిలా ఉంటే.. సీజన్​ వ్యాధులను నివారణకు అధికారులు పలు సూచనలు చేశారు. వేడిచేసి చల్లార్చిన నీటినే తాగడం, వేడి ఆహారం తీసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా టైఫాయిడ్, అతిసారం వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు.PHCలలో ప్రత్యేక బెడ్స్​, మెడిసిన్స్​ సిద్ధంగా ఉంచామని ఆరోగ్య శాఖ తెలిపింది.