- ధరణితో భూస్వాముల వారసుల పేర్లపై నమోదైన వేలాది ఎకరాలు
- సర్వే చేసి అర్హులైన రైతులను గుర్తించిన ప్రభుత్వం
- 1921 మంది రైతులకు 2,091 ఎకరాలు అందజేత
- పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లో దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న సీలింగ్ భూముల సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ధరణి పోర్టల్ లోపాల కారణంగా రికార్డుల్లో భూస్వాముల పేరుపైకి మారిన భూములు తిరిగి అసలైన సాగుదారులకు చేతికి అందాయి. నూతనకల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పట్టాలు అందజేశారు. నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో వేలాది ఎకరాల సీలింగ్ భూములను 65 ఏండ్లుగా పలువురు రైతులు సాగు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపాల కారణంగా ఆ భూములన్నీ రికార్డులపరంగా భూస్వామి జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి వారసుల పేర్ల మీద నమోదయ్యాయి. దీంతో ఈ రెండు మండలాల్లోని 15 గ్రామాల రైతులు రైతు బంధు, క్రాప్‌లోన్లకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. ఆఫీసర్లు రైతుల వద్దకే వెళ్లి నోటీసులు ఇచ్చి, క్లెయిమ్‌లను పరిశీలించారు. ఈ మేరకు 2,091.135 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న 1,921మంది రైతులను అర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారు. భూములు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి రికార్డుల్లో జెన్నారెడ్డి వారసుల పేర్లను తొలగించి, పట్టాదార్ కాలమ్‌లో రైతుల పేర్లను చేర్చారు.
మరో పదేండ్లు మేమే: మంత్రి కోమటిరెడ్డి తెలంగాణలో మరో పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాల సంఖ్య 183కి పెరిగితే.. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి తమకు ప్రచారాలు, ఆర్భాటాలు అవసరం లేదని, ప్రజల వద్దకు వెళ్లి అడిగితే వాళ్లే చెబుతారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పట్ల ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుందని, ఆ రుణాన్ని తీర్చుకునేందుకే జనం కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం ధర్నాలు చేయిస్తున్నాయని విమర్శించారు. విపక్షాల హడావుడితో ప్రజల తీర్పును మార్చలేరన్నారు. గుడిసెలు లేని తెలంగాణగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేశ్ కుమార్, ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ పాల్గొన్నారు.
పంచాయితీ లేని భూములకు పట్టాలిస్తం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా వివాదాలు లేని భూమిని సర్వే చేసి, అసలైన యజమానులకు పట్టాలు అందిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నూతనకల్, మద్దిరాల గ్రామాలకు చెందిన రైతులకు శనివారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఏండ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలన్నింటికీ ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. మొదటి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేయించామన్నారు. దేవాదాయ, అసైన్డ్, రెవెన్యూ భూముల కబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏడాదిలోగా వివాదరహిత భూములన్నింటి సర్వే పూర్తి చేసి హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
