హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలో ఆదివారం హైదరాబాద్ వార్షిక రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉండనున్నాయి. ఉదయం 4.30 నుంచి 9.30 గంటల వరకు ఇవి కొనసాగుతాయని ట్రాఫిక్పోలీసులు తెలిపారు. నగరవాసులు, వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
మారథాన్ సాగే మార్గాలు
పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే ఈ మారథాన్.. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు కొనసాగనుంది.
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు
నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ మార్గాల వైపు వచ్చే వాహనాలపై ఉదయం పూట ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోనూ పలు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజ్‌భవన్ వైపు నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అమీర్‌పేట్, రోడ్ నంబర్ 10, రోడ్ నంబర్ 12, క్యాన్సర్ హాస్పిటల్ మార్గాల వైపు మళ్లిస్తారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు వాహనాలకు అనుమతి లేదు. ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని, మారథాన్విజయవంతానికి సహకరించాలని ట్రాఫిక్పోలీసులు కోరారు.
