ముషీరాబాద్, వెలుగు: పరీక్షకు ఒక్క రోజు ముందు హైదరాబాద్‌లో నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కర్నూలు ప్రాంతానికి చెందిన యశ్విత(26) ఆరు నెలలుగా చిక్కడపల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్నది. శనివారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు.
నీట్ పరీక్ష ఉండడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన యశ్విత ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పటి నుంచే ఒత్తిడికి గురవుతున్నట్టు తెలిసింది. మృతురాలు కర్నూల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏకైక కుమార్తెగా గుర్తించారు.
