మా ఉద్యోగుల స్కిల్స్ పెంచండి...మంత్రి శ్రీధర్ బాబుకు మారిషస్మంత్రి లుచ్మనన్ విజ్ఞప్తి

మా ఉద్యోగుల స్కిల్స్ పెంచండి...మంత్రి శ్రీధర్ బాబుకు మారిషస్మంత్రి లుచ్మనన్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వ ఉద్యోగుల స్కిల్స్​, సామర్థ్యాన్ని, ఆధునిక పాలన విధానాలను మెరుగుపరిచేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబును మారిషస్​దేశ పబ్లిక్​ సర్వీస్​, అడ్మినిస్ట్రేటివ్​ రీఫార్మ్స్​ మంత్రి లుచ్​మనన్​పెంతియా కోరారు. శనివారం ఆయన సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్యా తదితర రంగాల్లో ‘తెలంగాణ – మారిషస్’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకున్న  అవకాశాలు, కార్యాచరణపై చర్చించారు. 

తెలంగాణను తమ దేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తోందని లుచ్​మనన్​ పెంతియా చెప్పారు. రాష్ట్రంలోని ఎంసీహెచ్ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇతర ప్రముఖ విద్యా సంస్థలతోనూ పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. పెంతియా విజ్ఞప్తికి మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. అన్ని రంగాల్లోనూ మారిషస్ కు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డిసెంబర్ 7,8 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026’లో పాల్గొనాలని ఆహ్వానించారు. సమావేశంలో సెక్రటరీ ఫర్ పబ్లిక్ సర్వీస్ దేవేంద్ర గోపాల్, అటల్ బిహారీ వాజ్‌‌పేయి ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్ (ఏఐపీఎస్ఐ) బోర్డ్ చైర్​పర్సన్ డాక్టర్ నికోలస్ రాగోడూ, ఏఐపీఎస్ఐ రిజిస్ట్రార్ డా. రమేశ్​ దుర్బరీ, ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియెట్ హెడ్ మాధవ్ ఆర్. సుల్ఫులే, ఇండస్ట్రీస్​ స్పెషల్​సెక్రటరీ కృష్ణ ఆదిత్య, ఐటీఈ అండ్ సీ జాయింట్​సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.