MBBS రిజిస్ట్రేషన్ఫీజు పెంచిన కాళోజీ వర్సిటీ.. C కేటగిరీకి రూ.2 లక్షలు, B -కేటగిరీకి రూ.లక్ష 

MBBS రిజిస్ట్రేషన్ఫీజు పెంచిన కాళోజీ వర్సిటీ.. C కేటగిరీకి రూ.2 లక్షలు, B -కేటగిరీకి రూ.లక్ష 
  • ఐదేళ్ల తర్వాత సవరణ
  • ‘సీ’ కేటగిరీకి రూ.2 లక్షలు, 
  • ‘బీ’ -కేటగిరీకి రూ.లక్ష 
  • బీడీఎస్ మేనేజ్‌‌‌‌మెంట్ ఫీజులు డబుల్​
  • 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు యూనివర్సీటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ షాక్ ఇచ్చింది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ప్రవేశాల సమయంలో చెల్లించాల్సిన యూనివర్సిటీ ఫీజులను భారీగా పెంచుతూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీకి చెందిన 20వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సవరణ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. 

చివరిసారిగా 2021–-22లో ఫీజులను పెంచిన వర్సిటీ, దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా 100 నుంచి 186 శాతం వరకు పెంచడంతో అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థులపై లక్షల్లో భారం పడనుంది. సవరించిన ఫీజుల ప్రకారం.. మేనేజ్‌‌‌‌మెంట్ కోటా కింద సీటు పొందే విద్యార్థులపై ఫీజుల వడ్డింపు భారీగా ఉంది. గతంలో ఎంబీబీఎస్ 'బీ' కేటగిరీ కింద యూనివర్సిటీ ఫీజు రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడది ఏకంగా రూ. లక్షకు చేరింది. 

ఇక ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ) కోటా కింద ప్రవేశం పొందే విద్యార్థులపై ఏకంగా 186 శాతం అదనపు భారం వేశారు. 
గతంలో రూ. 70 వేలుగా ఉన్న ఈ ఫీజును ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచారు. డెంటల్(బీడీఎస్) కోర్సులోనూ ఫీజులను వర్సిటీ రెట్టింపు చేసింది. 'బీ' కేటగిరీ విద్యార్థులకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు, 'సీ' కేటగిరీ విద్యార్థులకు రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంపీటెంట్ అథారిటీ కోటా కింద పీజీ ఎండీఎస్ కోర్సు ఫీజును రూ.35 వేలుగా ఖరారు చేశారు.

ఐదేళ్ల తర్వాత భారీగా పెంపు.. 

సాధారణంగా కాలేజీలకు చెల్లించే ట్యూషన్ ఫీజు కాకుండా, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కోసం విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ఈ యూనివర్సిటీ ఫీజును వన్ -టైమ్ పేమెంట్‌‌‌‌ గా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా వీటిని లక్షల్లోకి పెంచడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ లో సీటు పొందిన అభ్యర్థులు అడ్మిషన్ లెటర్ పొందడానికి ముందే సవరించిన ఈ కొత్త ఫీజులను చెల్లించాలని వర్సిటీ స్పష్టం చేసింది.