హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో కీలకమైన బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం ఇక్కడే 5 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంబర్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాలను అనుసంధానం చేసే ఈ బ్రిడ్జిని రూ.52 కోట్ల అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. వాహనదారులతోపాటు పాదచారుల సౌకర్యార్థం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేశారు. మూసీ వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా దీని నిర్మాణం చేపట్టారు.
వర్షాకాలంలో మూసీ నది ఉధృతంగా ప్రవహించినప్పుడు ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. బ్రిడ్జి అందుబాటులోకి వస్తుండడంతో 365 రోజులూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అంబర్‌పేట–మూసారాంబాగ్ మధ్య రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుంది. మూసారంబాగ్ బ్రిడ్జిని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్శనివారం పరిశీలించారు. బ్రిడ్జి అప్రోచ్‌లు, భద్రతా చర్యలు, లైటింగ్, పాదచారుల సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు.
2023లో బంద్‌చేసి, పనులు చేయలే..
భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రతీసారి ఇక్కడ ఇబ్బందులు ఏర్పడేవి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మాత్రమే బ్రిడ్జి ప్రస్తావన వచ్చేది. ఆ తర్వాత నిర్మాణం విషయాన్ని పట్టించుకోలేదు. 2023 జూలైలో జంట జలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మూసారాంబాగ్ బ్రిడ్జి బంద్ చేశారు. మరోసారి ఇబ్బందులు రాకుండా బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని, అందుకు సంబంధించిన పనులను 10 రోజుల్లో ప్రారంభిస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చెప్పారు.
కానీ, పనులు మాత్రం మొదలు పెట్టలేదు. బ్రిడ్జి కోసం టెండర్లు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కానీ, పనులు పూర్తి చేయలేకపోయారు. ఎన్నికలు రావడంతో ముందుకుసాగలేదు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక 2024లో పనులు తిరిగి స్టార్ట్ చేశారు. పాత బ్రిడ్జి కూల్చివేత, తదితర సమస్యల కారణంగా కొంత ఆలస్యమైంది. ఈ ఏడాది పనులు వేగంగా చేయడంతో ఎట్టకేలకు పూర్తయ్యాయి.
