- సిద్దిపేటలో నెల రోజుల్లో ఆరుగురు పట్టివేత..
- డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు
సిద్దిపేట/గద్వాల, వెలుగు : సిద్దిపేట, గద్వాల జిల్లా ల్లో పలు చోట్ల గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. అక్రమార్జనకు అలవాటు పడిన వారు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి యువత, మైనర్లే లక్ష్యంగా చేసుకుని అమ్ముతున్నారు. ఒకవైపు గంజాయి అమ్మకాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా చాప కింద నీరులా సాగుతూనే ఉంది.
సిద్దిపేట జిల్లాలో ఇదీ పరిస్థితి...
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నెల రోజుల వ్యవధిలో గంజాయి అమ్ముతూ ఓ బాలుడు పట్టుబడగా, మరో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతూ పట్టుబడగా, చేర్యాలలో ఒక పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉపాధి కోసం ఇక్కడకొచ్చి..
యువకులు, మైనర్లనే లక్ష్యంగా చేసుకుని రహస్య అడ్డాలు, రద్దీ లేని ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు గంజాయి సేవించడంతో పాటు అమ్మకాలకు పాల్పడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సిద్దిపేటలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ వారిలో ఇతర రాష్ట్రానికి చెందిన యువకులు ఉండటం గమనార్హం.
ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఎండు గంజాయిని ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నారు. గంజాయికి అలవాటు పడ్డ యువకులతో వీటిని అమ్మేవారు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారికి అందజేస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్‌లతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో గంజాయి సిగరెట్లు, చాక్లెట్లు రహస్యంగా అమ్ముతున్నారు.
గట్టి నిఘా పెట్టినా ఆగని దందా..
గంజాయి అమ్మకాలపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా పెట్టినా ఎక్కడో ఒక చోట అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థులకు మత్తు పదార్థాల సేవనం వల్ల ఏర్పడే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, వాటి అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎక్కువగా విద్యార్థులు, యువకులు, మైనర్లు మత్తు పదార్థాల బారిన పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో యువతను సరైన మార్గంలో మళ్లించడం కోసం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ‘డీ అడిక్షన్ సెంటర్’ను ఏర్పాటు చేసి, మత్తుకు అలవాటు పడ్డ వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
గద్వాల జిల్లాకు ఏపీ, కర్ణాటక నుంచి మత్తు పదార్థాలు
జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. ఏపీలోని కర్నూలు నుంచి, ఇటు కర్ణాటకలోని రాయచూరు నుంచి రెండు రాష్ట్రాల బార్డర్ దాటి జోగులాంబ గద్వాల జిల్లాలోకి గంజాయి వస్తున్నది. జిల్లాలోని కొందరు అక్కడక్కడ పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తూ సరఫరా చేస్తున్నారు.
ఇటీవలే మూడుసార్లు గంజాయి పట్టుబడింది. ఈనెల 8న అలంపూర్ నియోజకవర్గంలోని సుల్తానాపురంలో ఒక ఇంట్లో కేజీ 30 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 10న అయిజ మండలం భూమిపురం గ్రామ శివారులో మోటార్ సైకిళ్లు తనిఖీ చేస్తుండగా 77 గ్రాముల గంజాయి పట్టుబడింది. గురువారం రాత్రి గద్వాల టౌన్ లో వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా కొంత గంజాయి లభ్యమైంది.
ఆ రెండు బార్డర్ల నుంచి..
గద్వాల జిల్లాలోకి అటు ఏపీలోని కర్నూల్ పంచలింగాల బార్డర్ నుంచి, ఇటు కర్ణాటకలోని రాయచూరు నుంచి నందిన్నె చెక్ పోస్ట్ మీదుగా స్మగ్లర్లు గంజాయిని తీసుకొస్తున్నారు. బార్డర్ దాటి వచ్చిన గంజాయిని కొందరు వ్యక్తులు 5 నుంచి 10 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలంపూర్ మండల పరిధిలోని సుల్తానాపురం గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ ఒకరు కర్నూలులో హాస్పిటల్ నడుపుతూ, అక్కడి నుంచి గంజాయిని తనగ్రామానికి తీసుకొచ్చి ఇంట్లోనే యువకులకు విక్రయిస్తున్నాడు.
గద్వాల టౌన్ లోని గత కొన్ని నెలలుగా మూతపడిన ఓ థియేటర్, ఇండోర్ స్టేడియం పక్కన ఖాళీ ప్రదేశాలు, రాజీవ్ మార్కెట్ సమీపంలోని టీ స్టాల్స్ గంజాయి అడ్డాలుగా మారాయి. సాయంత్రం సమయంలో ఇక్కడకు చేరే యువకులు గంజాయి సేవిస్తూ మత్తులో వికృత చేష్టలకు దిగుతున్నారు. గంజాయి ఇతర పదార్థాలు దొరకనప్పుడు ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. సైకిల్ టైర్లకు వాడే సొల్యూషన్, ఫెవికాల్, చెప్పులకు వాడే గమ్ము, వైట్నర్లను బట్ట లేదా పత్తిలో వేసుకొని వాసన చూస్తూ గంటల తరబడి మత్తులో తూలుతున్నారు.
గంజాయి కట్టడి పై ఫోకస్ పెట్టాం
గద్వాల జిల్లాలో గంజాయి కట్టడిపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. పూర్తిస్థాయిలో గంజాయిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాలి.
-మొగులయ్య, డీఎస్పీ, గద్వాల
