హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు కావస్తున్నందున మంత్రివర్గ ప్రక్షాళన జరగాల్సిందేనని, అప్పుడే ప్రభుత్వంలో కొత్తదనం కనిపిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్షాళన వల్ల అసంతృప్తులకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వంలో కూడా మార్పు రావాలని, ముఖ్యంగా అధికారుల తీరు మారినప్పుడే ప్రజల్లో ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని తెలిపారు.
శనివారం శాసన మండలిలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. పార్టీ క్రమశిక్షణ పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకుంటేనే పార్టీకి మంచిదన్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి పార్టీ మంచి అవకాశం కల్పించినప్పుడు, ఆయన అలా మాట్లాడాల్సింది కాదని చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు తగాదాలను కూడా అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
‘తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇంకా సహాయం చేయాలి. కాంగ్రెస్ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తగ్గించినప్పుడే ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కోవచ్చు. దీంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది..’ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే 22ఏలో ఎక్కువ వివాదాలు ఉండేవని, భూభారతిలోనూ ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని, దీంతో కొందరు ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో 22ఏను రద్దు చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఉచిత పథకాల విషయంలో కొంత నియంత్రణ ఉండాలని, అర్హులైన వారికే అవి అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘సీఎంగా రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు.. ఆయన్ను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలి. ఆయనకు అందరూ సహకరించాలి’ అని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు.
