కందనూలు, వెలుగు : రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ సాంకేతికత వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కూడా దీనిని విస్తృతంగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను కేవలం ప్రదర్శనలకు పరిమితం చేయకుండా, వాటి ఆర్థిక ప్రయోజనాలు, పెట్టుబడి-ఆదాయ నిష్పత్తి, రైతులకు కలిగే లాభాలను స్పష్టంగా వివరించి, ఆచరణలోకి తీసుకువచ్చేలా కేవీకే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
కేవీకే ఇన్‌స్ట్రక్షనల్ ఫారంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి యూనిట్, షేడ్‌నెట్ నర్సరీ ఉత్పత్తి యూనిట్, వర్మీకంపోస్ట్ యూనిట్, పందిరి కూరగాయల సాగు, డ్రాగన్ ఫ్రూట్ ప్రదర్శన యూనిట్‌తో పాటు వివిధ పంటలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలకు సంబంధించిన ప్రదర్శన యూనిట్లను పరిశీలించారు. కేవీకే, పాలెం ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన వ్యవస్థాపకతకు సంబంధించిన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
