కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తే మూడ్ఆఫ్‌ ది హౌసా..?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తే మూడ్ఆఫ్‌ ది హౌసా..?

 

  •     వాళ్ల మాటలను బట్టి కౌశిక్​ రెడ్డి అంశంపై ఎథిక్స్​ కమిటీలో చర్చిస్తారా?
  •     కమిటీ సభ్యులను ప్రశ్నించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: పాడి కౌశిక్​ రెడ్డి వివాదం జరిగినప్పుడు 23 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతోనే మాట్లాడించారని, అది మూడ్​ ఆఫ్‌ ది హౌస్‌ ఎలా అవుతుందని అసెంబ్లీ ఎథిక్స్​ కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ సభ్యుల మాటల ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఎజెండాగా చేర్చారని మండిపడ్డారు. 

శనివారం ఎథిక్స్​ కమిటీ మీటింగ్​ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్​చాట్​ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంపై ఎథిక్స్ కమిటీ చర్చించాలని చైర్మన్​ను కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వీర్లపల్లి శంకర్, మందుల సామేల్​ సభలో అనుచితంగా  మాట్లాడటంపై ఎథిక్స్ కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చామన్నారు. కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు సహకరించుకుంటున్నాయన్న ఎథిక్స్ కమిటీ కాంగ్రెస్ సభ్యుడి ఆరోపణలో నిజం లేదని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఏం జరుగుతుందో తెలియదని, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని తెలిపారు.