- దేశ పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్లు
- కొనసాగుతున్న వరద సహాయక చర్యలు
- ఇప్పటికీ లభించని 2,400 మంది ఆచూకీ
- 4,450 మందిని రక్షించిన భద్రతా సిబ్బంది
- అందులో 187 మంది విదేశీయులని వెల్లడి
ఖాట్మండు: ప్రకృతి విలయంతో నేపాల్ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లింది. దేశ పునర్నిర్మాణ పనుల కోసం సుమారు 4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33,000 కోట్ల నుంచి రూ.42,000 కోట్లకు పైగా) అవసరమవుతాయని ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. ఇది దేశ జీడీపీలో దాదాపు పదో వంతుకు సమానమని ఆయన పేర్కొన్నారు.
నష్ట తీవ్రతపై తుది అంచనా వేస్తున్నామని, అయితే 2015 నాటి భూకంపంతో పోలిస్తే ఈసారి పునర్నిర్మాణ వ్యయం కొంత తక్కువగానే ఉండవచ్చని ఆయన చెప్పారు. కాగా, నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకొని మృతిచెందిన వారి సంఖ్య 675కు చేరింది. బురదలో కూరుకుపోయిన డెడ్‌బాడీలను భద్రతా బలగాలు వెలికితీశాయి.
సుమారు 2,400 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి ఇప్పటివరకూ 4,450 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. వీరిలో 187 మంది విదేశీయులు ఉన్నారు. ప్రధానంగా రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడ యుద్ధప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విపత్తు తీవ్రత భారీగా ఉండటంతో నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం సాయం కోరింది. టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత్‌కు చెందిన 11 మంది నిపుణుల సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. భారత్ ఇప్పటికే 57 టన్నుల నిత్యావసర, సహాయక సామగ్రిని తరలించింది. చైనా నుంచి ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం రానుండగా.. జపాన్, ఆస్ట్రేలియాల నుంచి కూడా సహాయక సామగ్రి చేరుకుంటోంది.
కాగా, బాధితుల్లో విదేశీ పర్యాటకులు భారీగా ఉండటంతో నేపాల్ విదేశాంగ శాఖ ప్రత్యేక ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మృతుల గుర్తింపు, బాధిత కుటుంబాలతో సమన్వయం, స్వదేశాలకు పంపే ప్రక్రియలను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది. వరదల ధాటికి మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధాన వంతెనలు, రోడ్లు ధ్వంసమవడంతో పాటు జలవిద్యుత్ కేంద్రాలు నీటమునిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం నష్టతీవ్రతను అంచనా వేసే పనిలో పడింది.
సహాయాన్ని తిరస్కరించలేదు: నేపాల్ ప్రభుత్వం
అంతర్జాతీయ సాయాన్ని ప్రభుత్వం నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను నేపాల్ కొట్టిపారేసింది. పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాల మద్దతు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు లెక్కలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నేరుగా ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలు జమ చేయాలని కోరింది. సరిహద్దుల్లో చిక్కుకున్న భారతీయులు నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించిన వివరాల ప్రకారం..కనీసం 320 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చైనా వైపు దాదాపు 400 మంది చిక్కుకుపోగా, వారిలో 153 మంది సురక్షితంగా సరిహద్దు దాటి నేపాల్ చేరుకున్నారు. నేపాల్ చేరుకున్న 149 మంది భారతీయుల వివరాలతో కూడిన జాబితాను విదేశాంగ శాఖ విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఖాట్మండు చేరుకున్న వారిలో 21 మంది భారతీయులు ఢిల్లీకి వచ్చారు.
త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను రెస్క్యూ బృందాలు క్షేమంగా కాపాడాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి ఉంటారని భావిస్తున్న దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తులు ఇంకా సంప్రదింపులకు అందడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
చైనా ముందస్తు సమాచారం ఇవ్వలే: మాజీ మంత్రి
నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల వెనుక చైనా నిర్లక్ష్యం ఉందంటూ నేపాల్ మాజీ మంత్రి మాధవ్ ప్రసాద్ చౌలాగైన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సరిహద్దుల్లో భారీ విపత్తు ముంచుకొస్తున్నా.. చైనా తమకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. బుధవారం ఉదయం 8:40 గంటల ప్రాంతంలో నేపాల్–-టిబెట్ సరిహద్దు మీదుగా మంచు, బండరాళ్లు, బురదతో కూడిన భారీ ప్రవాహం నేపాల్‌పై విరుచుకుపడింది.
పొరుగు దేశం చైనా తమను ముందుగా హెచ్చరిస్తే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ విపత్తు సమయంలో చైనా ఆ యంత్రాంగాన్ని ఉపయోగించలేదని మండిపడ్డారు.
ఈ విపత్తు నేపాల్ భూభాగంలోనే ప్రారంభమైందన్న బీజింగ్ వాదనను ఆయన తోసిపుచ్చారు. ఈ విధ్వంసం టిబెట్ ప్రాంతంలోనే మొదలైందని స్పష్టం చేస్తూ, చైనా సమాచారాన్ని దాచడం ‘మానవత్వానికే విరుద్ధం’ అని విమర్శించారు. నేపాల్, చైనా, భారత్‌ల మధ్య సమన్వయంతో కూడిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అత్యవసరమని పేర్కొన్నారు.
కొట్టుకొచ్చిన బ్యాంక్ లాకర్‌ను పగలగొట్టి లక్షల దోపిడీ
నేపాల్‌లో వరదల్లో కొట్టుకొచ్చిన ఓ బ్యాంక్ సేఫ్‌ను పగలగొట్టి అందులోని నగదు లూటీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రసువా పరిధిలోని భోటే కోశీ నదిలో వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఓ బ్యాంకు సేఫ్.. ధాడింగ్ జిల్లా గల్ఛీ పరిధిలోని త్రిశూలి నదీ తీరానికి చేరింది. దీన్ని గమనించిన కొందరు స్థానికులు ఆ సేఫ్‌ను పగలగొట్టి లోపలున్న కరెన్సీ కట్టలను పంచుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు 29 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 92.68 లక్షల నేపాలీ రూపాయలను (దాదాపు రూ. 57 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వయసు 19 నుంచి 49 ఏండ్ల మధ్య ఉందని, పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
