న్యూఢిల్లీ: డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా ‘డ్రగ్-ఫ్రీ యూత్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ ఉద్యమం వేగం పుంజుకుంటోందని చెప్పారు. యువతను డ్రగ్స్ నుంచి కాపాడటం ద్వారా దేశ భవిష్యత్తును మరింత బలోపేతం చేయవచ్చన్నారు. ఇదే సమయంలో మహిళల ఆర్థిక సాధికారతకు పీఎం స్వనిధి పథకం అందిస్తున్న తోడ్పాటును కూడా మోదీ వివరించారు.
ఆదివారం ప్రసారమైన 124వ ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటులేని యువత, దేశం లక్ష్యంగా ప్రజలంతా కలిసి పనిచేయాలని కోరారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంచడంతోపాటు, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు సామాజిక భాగస్వామ్యం అవసరమన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ‘డ్రగ్-ఫ్రీ యూత్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ ప్రచారానికి ప్రజల మద్దతు పెరుగుతోందని తెలిపారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు తమ వేదికల ద్వారా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. యువతలో అవగాహన కల్పించడంలో ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావం కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 2020 ఆగస్టు 15న ప్రారంభమైన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ లో అవగాహన కార్యక్రమాలతోపాటు ట్రీట్‌మెంట్, పునరావాసం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
స్వనిధితో మహిళలకు కొత్త బలం
పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు తమ వ్యాపారాలను డెవలప్చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారని మోదీ అన్నారు. ఈ స్కీం లబ్ధిదారుల్లో దాదాపు 46 శాతం మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా 35 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు 2020లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ఈ స్కీంను 2030 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, ఒడిశాలోని దిబ్రూగఢ్ ప్రాంతానికి చెందిన మైథిలి భుయే అటవీ పరిరక్షణ, ఎకో టూరిజం ద్వారా జీవనోపాధి పొందుతున్న తీరును ప్రధాని ప్రశంసించారు. గతంలో అడవికి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించిన ఆమె, ప్రస్తుతం ఎకో టూరిజంతో అటవీ పరిరక్షణలో భాగస్వామిగా మారారని చెప్పారు.
