- ప్రతి మృతదేహానికి ఒక గుర్తింపు సంఖ్య.. డీఎన్‌ఏ నమూనాల స్టోరేజ్
- సమాధి స్థలాలకు జియో-ట్యాగింగ్.. వీడియో రికార్డింగ్
- నదీ ప్రవాహాల్లో కొట్టుకువస్తున్న మృతదేహాలు
- 760 దాటిన మృతుల సంఖ్య.. మరో 3 వేల మంది గల్లంతు
- ఇంకా దొరకని 275 మంది భారతీయుల ఆచూకీ
ఖాట్మాండు: నేపాల్‌లో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటీవల సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదలు, కొండచరియల విలయంలో కొట్టుకొచ్చి లభ్యమైన గుర్తుపట్టలేని 229 మృతదేహాలకు అధికారులు దక్షిణ-మధ్య నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలో సామూహిక ఖననం నిర్వహించారు. రోజుల తరబడి నీరు, బురదలో నానడంతో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరడం, స్థానిక మార్చురీల్లో స్థలం లేకపోవడంతో జిల్లా భద్రతా కమిటీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది.
భవిష్యత్తులో బంధువులు తమవారిని గుర్తించేందుకు వీలుగా అధికారులు పకడ్బందీ ఫోరెన్సిక్ ప్రొటోకాల్‌ను అమలు చేశారు. శరీరాలపై లభించిన దుస్తులు, పచ్చబొట్లు, ఆభరణాల వివరాలను ఫొటోలతో సహా డిజిటలైజ్ చేసి భద్రపరిచారు. ప్రతి మృతదేహానికి ఒక గుర్తింపు సంఖ్యను కేటాయించి, డీఎన్‌ఏ నమూనాలను భద్రపరుస్తున్నారు. భవిష్యత్తులో బంధువులు వచ్చినప్పుడు సులభంగా వెలికితీసేందుకు వీలుగా 1.5 మీ. లోతు గుంతల్లో, ఒకదానికి మరొకటి 40 సెం.మీ దూరం ఉండేలా ఖననం చేస్తున్నారు.
సమాధి స్థలాలను జియో-ట్యాగింగ్ చేస్తూ, వీడియో రికార్డింగ్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ విపత్తులో వందలాది మంది భారతీయ యాత్రికులు, కార్మికులు కూడా గల్లంతవడంతో మృతుల గుర్తింపు కోసం భారత్ ప్రత్యేక ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించింది. బాధితుల బంధువుల డీఎన్‌ఏ మ్యాచ్ అయితే, ఆయా నంబర్ల గుంతల నుంచి మృతదేహాలను వెలికితీసి అప్పగిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ పెను విపత్తులో ఇప్పటివరకు 768 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3వేల మందికి పైగా గల్లంతయ్యారు.
శిథిలాల కింద, నదీ ప్రవాహాల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరద తీవ్రతకు విద్యుత్ ప్రాజెక్టులు కుదేలయ్యాయి. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లోని సొరంగాల్లో సుమారు 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. నేపాల్ సైన్యం పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. టన్నెల్ రెస్క్యూలో అపార అనుభవం ఉన్న భారత్ నుంచి 11 మంది నిపుణుల బృందం, చైనా నుంచి తొమ్మిది మంది నిపుణులు రంగంలోకి దిగి రక్షణ చర్యలను వేగవంతం చేశారు.
275 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు
నేపాల్‌లో ఆచూకీ లేకుండా పోయిన వారిలో దాదాపు 275 మంది భారతీయులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. వీరిలో తమిళనాడుకు చెందిన దాదాపు 100 మంది టూరిస్టులు కూడా ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించింది.
రాయబారి నవీన్ శ్రీవాస్తవ క్షేత్రస్థాయి అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే, సరిహద్దుల్లో భారీ కొండచరియలు విరిగిపడి కొత్తగా మరో కృత్రిమ సరస్సు ఏర్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది ఎక్కడ మళ్లీ తెగిపడుతుందోనన్న భయంతో గైరోంగ్ పోర్ట్ ప్రాంతంలోని సహాయక సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
శిబిరాల్లో బాధితుల ఆర్తనాదాలు
వేలాది మంది ప్రజలు ప్రస్తుతం పునరావాస శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నువాకోట్, రసువా జిల్లాల్లోని పాఠశాలలు, తాత్కాలిక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. పైప్‌లైన్లు ధ్వంసం కావడంతో తాగునీరు దొరక్క బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు అవసరమైన అత్యవసర మందులు అందక, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీగా ప్రాణనష్టం జరగడం, వేలాది మంది గల్లంతు కావడంతో ఆస్పత్రుల వద్ద బంధువుల రోదనలు మిన్నంటగా, సర్వస్వం కోల్పోయిన నిరాశ్రయులు తమ భవిష్యత్తు ఏమిటో పాలుపోక అగమ్యగోచర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
