పాలిటెక్నిక్ కాలేజీల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి..జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్

పాలిటెక్నిక్  కాలేజీల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి..జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్
  •     సీఎంకు ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్  కాలేజీలను రద్దు చేయవద్దని సీఎం రేవంత్​రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్  కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం విద్యానగర్  బీసీ భవన్ లో బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా ఆయన సీఎంకు లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్  కాలేజీలను మహీంద్రా స్కిల్  యూనివర్సిటీగా విలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. 

దీంతో విద్యార్ధుల ఉన్నత విద్య, భవిష్యత్తు దెబ్బతిని పాలిటెక్నిక్  కాలేజీలు లేబర్  డిపార్ట్​మెంట్​గా మారే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్  చేశారు. నిధులు కేటాయించి పాలిటెక్నిక్  కాలేజీల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఇప్పటికే బలంగా ఉన్న పాలిటెక్నిక్  విద్యా వ్యవస్థను ఎత్తేయాల్సిన అవసరం లేదన్నారు. 

డిప్లొమా తర్వాత పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు దోహదం చేస్తుందన్నారు. పాలిటెక్నిక్ ను ఐటీఐ లేదా ఇతర స్వల్పకాలిక స్కిల్  ట్రైనింగ్ తో సమానంగా చూడవద్దని సూచించారు. రాజేందర్, నిఖిల్  పటేల్, వంశీ, బాలయ్య, సాయిబాబా పాల్గొన్నారు.