- రాష్ట్రంలో ఇప్పటికే ఐదు మార్గాలలో వందేభారత్ రైళ్లు నడుస్తున్నయ్
- అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని వెల్లడి
వికారాబాద్/తాండూరు/చేవెళ్ల/అలంపూర్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో బుల్లెట్ ట్రైన్లు పరుగులు తీస్తాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్లు వస్తే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి కిషన్రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. బుల్లెట్ ట్రైన్ తెలంగాణ అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 43 రైల్వేస్టేషన్లు ఆధునీకరణ చేపడుతున్నట్టు చెప్పారు. రైల్వే స్టేషన్లను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. సింగిల్ లైన్ ఉన్న దగ్గర డబుల్ లైన్, డబుల్ లైన్ ఉన్న దగ్గర త్రిబుల్ లైన్, త్రిబుల్ లైన్ ఉన్న దగ్గర నాలుగు లైన్లు వేసుకుంటూ రైల్వే కనెక్టివిటిని పెంచుతున్నట్లు చెప్పారు. కొమురవెల్లిలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా రైల్వే స్టేషన్‌ను నిర్మించినట్లు వివరించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని రైల్వే సమస్యలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి జీఎంతో చర్చిస్తామన్నారు.
బీజేపీ పాలనలోనే దేశం సుభిక్షం
కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీతోనే దేశం సుభిక్షంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రమేశ్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కిషన్రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరై, మాట్లాడారు. దేశంలో 18 కోట్ల సభ్యత్వం కలిగిన అతి పెద్ద పార్టీ బీజేపీనే అని తెలిపారు. 12 ఏండ్లుగా ఎలాంటి అవినీతి లేని పాలన అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కమీషన్లు, పర్సంటేజీల పాలనగా మార్చిందని విమర్శించారు. అంతకుముందు తాండూరు మండలం జీన్గుర్తి పరిధిలోని సాందీపని గురుకులాన్ని సందర్శించి, విద్యార్థులతో కలిసి మన్ కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. హైదరాబాద్-, -బీజాపూర్ హైవే పనులను స్పీడప్ చేయాలని ఆయన ఆదేశించారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ సమీపంలో కొనసాగుతున్న హైవే పనులను ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా ఇప్పటికే పలు పనులను చేశామని, భవిష్యత్‌లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అలంపూర్ ఆలయాల వద్ద మల్టీమీడియా, సౌండ్, లైట్స్ షోను ఇతర అతిధులతో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 25 నిమిషాలు ఆలయ చరిత్రను తెలియజేస్తూ ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా అన్నదాన భవనం, విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్టు, కల్చరల్ థియేటర్, తుంగభద్ర నదిలో బోటింగ్ సౌకర్యాలు కల్పించిందన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయ విశిష్టతను తెలియజేస్తూ మల్టీమీడియా సౌండ్ లైట్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడంతో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం సౌండ్స్ లైట్ షో కార్యాలయాన్ని ప్రారంభించి, మల్టీమీడియా సౌండ్ లైట్ షోను తిలకించారు.
