వెయ్యి కోట్లతో గోదావరి పుష్కరాలు..రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెప్పేలా నిర్వహిస్తం: మంత్రి కొండా సురేఖ

వెయ్యి కోట్లతో గోదావరి పుష్కరాలు..రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెప్పేలా నిర్వహిస్తం: మంత్రి కొండా సురేఖ
  •     తెలంగాణ పేరు దేశవ్యాప్తంగా మార్మోగేలా ఏర్పాట్లు చేయాలి
  •     అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి ఆదేశం
  •     ప్రజా భవన్‌‌‌‌లో పుష్కరాల ప్రత్యేకాధికారి ఆఫీస్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా దేశం నలుమూలలా రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెప్పేలా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ఉండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు తెలంగాణ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం ప్రతిబింబించేలా వసతుల కల్పన ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు ఆదివారం ప్రజా భవన్‌‌‌‌లో స్పెషల్ ఆఫీసర్ (ప్రత్యేక అధికారి) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.అనంతరం ప్రత్యేకాధికారి కార్యాలయంలోని నూతన కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు అనగానే ఇప్పటివరకు రాజమహేంద్రవరం పేరు ప్రధానంగా వినిపించేదని, వచ్చే గోదావరి పుష్కరాల నిర్వహణతో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకొని, పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం కేంద్ర బిందువుగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఘాట్ల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక అధికారి కార్యాలయం కీలక సమన్వయ కేంద్రంగా పనిచేయడంతో పాటు, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలవుతుందన్నారు. టైర్‌‌‌‌–1, టైర్‌‌‌‌–2 పరిధిలో సుమారు 2 కిలోమీటర్ల మేర ఘాట్‌‌‌‌ల నిర్మాణ పనులు ప్రారంభించగా, మొత్తంగా టైర్ 1, 2, 3 పరిధిలో 5 కిలోమీటర్లకి పైగా ఘాట్‌‌‌‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

పనుల నాణ్యతలో రాజీపడొద్దు...

పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి కొండా సురేఖ సూచించారు. ఇటీవల నేపాల్‌‌‌‌లో భీకర వరదలు వచ్చినా ఓ ఇల్లు చెక్కుచెదరకుండా నిలిచిందని, అది నాణ్యతకు నిదర్శనమని గుర్తుచేశారు. పుష్కరాల పనులను హడావుడిగా ముగించకుండా, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా నాణ్యమైన శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గోదావరి నది ఉధృతి ఎక్కువగా ఉండే ఘాట్ల వద్ద భక్తులు కొట్టుకుపోకుండా పటిష్టమైన గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, మహిళలకు ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులను పకడ్బందీగా నిర్మించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ కృష్ణ ప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు పాల్గొన్నారు.