- 100 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ హంగులతో మెగా ప్రాజెక్ట్
- క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, గ్లోబల్ కాన్సర్ట్‌లకు వేదిక
- నరేంద్ర మోదీ స్టేడియం రికార్డును మించేలా సీటింగ్ కెపాసిటీ
- డిసెంబర్లో భూమిపూజకు సర్కారు కసరత్తు.. ల్యాండ్ రాష్ట్రానిది, ఖర్చంతా బీసీసీఐదే!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడా రాజధానిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నది. క్రీడారంగానికి అధిక ప్రాధా న్యతనిస్తూ ఇప్పటికే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.
కేవలం క్రికెట్‌కే పరిమితం చేయకుండా, అవసరాన్ని బట్టి అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ప్రపంచ స్థాయి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లు నిర్వహించే విధంగా మల్టీపర్పస్ వెన్యూగా సరికొత్త హంగులతో మలచనున్నది. ఫ్యూచర్ సిటీ పరిధిలో 100 ఎకరాల అనువైన స్థలాన్ని గుర్తించే పని తుదిదశకు చేరగా, రానున్న డిసెంబర్ నెలలోనే శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మెగా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించనుండగా, స్టేడియం నిర్మాణం, భవిష్యత్ నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా భరించనున్నది.
సాంకేతిక హంగులు.. సరికొత్త ఆర్కిటెక్చరల్ డిజైన్
ప్రస్తుతం దేశంలోనే అతిపెద్దదిగా ఉన్న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం రికార్డులను సైతం బద్దలు కొట్టేలా ఫ్యూచర్ సిటీ స్టేడియాన్ని మరింత ఎక్కువ సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఇంగ్లాండ్‌లోని చారిత్రక లార్డ్స్ స్టేడియం, ఆస్ట్రేలియాలోని వరల్డ్ క్లాస్ మెల్‌బోర్న్ గ్రౌండ్స్ తరహాలోనే అత్యున్నత సాంకేతిక హంగులు, సరికొత్త ఆర్కిటెక్చరల్ డిజైన్లతో ఈ క్రీడా మైదానం రూపుదిద్దుకోనుంది.
ప్రస్తుతం నగరంలోని ఉప్పల్ స్టేడియం తక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండగా, కొత్త స్టేడియంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కనుంది. భారీ స్థాయిలో ఈవెంట్లు, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేందుకు హైదరాబాద్‌లో ప్రస్తుతం హెచ్‌ఐసీసీకి మించిన అతిపెద్ద సముదాయం అందుబాటులో లేకపోవడంతో.. ఆ లోటును భర్తీ చేస్తూ ప్రపంచంలోనే మేటి వేదికగా నిలిచేలా ఈ ప్రాంగణంలో సకల సౌకర్యాలను పొందుపరుస్తున్నారు.
అంతర్జాతీయ రవాణా నెట్‌వర్క్
ఈ మెగా స్పోర్ట్స్ హబ్‌కు చేరుకునేందుకు వీలుగా అత్యున్నత స్థాయి అంతర్జాతీయ రవాణా నెట్‌వర్క్‌ను పక్కాగా అనుసంధానిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉండటంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), త్వరలోనే ఫ్యూచర్ సిటీ వరకు రానున్న మెట్రో లైన్ ద్వారా దేశవిదేశీ ప్రేక్షకులు, క్రీడాభిమానులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా చేరుకోవచ్చు.
భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ టూరిజం, పర్యావరణహిత ‘నెట్-జీరో సిటీ’ కాన్సెప్ట్‌లో ఈ స్టేడియం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నది. భారీ వాహనాల పార్కింగ్ జోన్లు, అడ్వాన్స్‌డ్ డ్రైనేజీ వాటర్ మేనేజ్‌మెంట్, ప్లేయర్లకు హైటెక్ వసతులు, డిజిటల్ స్క్రీనింగ్ ఫీచర్లను ఇక్కడ సమకూర్చనున్నారు. ఈ మెగా మల్టీపర్పస్ స్టేడియం పూర్తయితే గ్లోబల్ మ్యాప్‌లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగడమే కాకుండా, స్థానిక యువతకు అంతర్జాతీయ అవకాశాలు, రాష్ట్ర పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
