జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఉండాల్సిందే.. కేంద్రానికి బీసీ నేతల అల్టిమేటం

జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఉండాల్సిందే.. కేంద్రానికి బీసీ నేతల అల్టిమేటం
  • ఓబీసీ జాతీయ సదస్సులో కేంద్రానికి బీసీ నేతల అల్టిమేటం
  •     యూనిక్‌‌‌‌ కోడ్​ లేకుండా చేసే జనగణనను నిలిపివేయండి
  •     ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు గుర్తింపు ఇవ్వాలి 
  •     లేదంటే త్వరలో దేశవ్యాప్త ఆందోళన చేపడతాం
  •     ఓబీసీల్లోని ప్రతి కులానికి గుర్తింపు ఇవ్వడం వల్ల కేంద్రానికి వచ్చిన ఇబ్బందేంటని  ప్రశ్న 

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో ఓబీసీ వర్గాల్లోని ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఓబీసీ సంఘాల నేతలు డిమాండ్‌‌‌‌ చేశారు. యూనిక్‌‌‌‌ లేకుండా చేపట్టబోయే జనగణన నిలిపివేయాలన్నారు. ప్రతి కులాన్ని గుర్తించకుండా చేపట్టే కులగణన శాస్త్రీయ పద్ధతి అనిపించుకోదన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక కాలమ్‌‌‌‌లు ఉన్నట్లుగానే.. ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఉండాలని డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో డ్రాప్‌‌‌‌డౌన్ మెనూ ద్వారా ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఇచ్చిన తర్వాత మాత్రమే జనగణన చేపట్టాలని, అప్పటి వరకు జనాభా లెక్కల ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. 

ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్‌‌‌‌లో ‘జనగణనలో కులగణన – ప్రతి కులానికి యూనిక్ కోడ్’ అనే ప్రధాన డిమాండ్‌‌‌‌తో జాతీయ సదస్సు జరిగింది. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం హైదరాబాద్, ఆలిండియా బీసీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫోరం, పార్టీ ఫర్ ఓబీసీ రైట్స్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ హైదరాబాద్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్‌‌‌‌లు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు బీసీ ఇంటెలెక్టువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిర్ణయించిన కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎస్సీ, ఎస్టీల వారిగా ఓబీసీల్లోని ప్రతి కులానికి ఒక గుర్తింపు ఇవ్వడం వల్ల కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజారిటీ వర్గాలను అక్కున చేర్చుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం తయారు చేసిన హౌస్ హోల్డ్ సర్వేలో ఎక్కడా కులగణన ప్రస్తావన లేదన్నారు. ఓబీసీల సరైన లెక్కలు లేనప్పుడు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని కోర్టులు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. అందుకే జనగణనలో బీసీల కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ప్రజా ధనం వృథా..

ఓబీసీలకు యూనిక్ కోడ్ అంశంపై దేశవ్యాప్త ఏకాభిప్రాయం ఏర్పడే వరకు కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డాక్టర్‌‌‌‌‌‌‌‌ సూరజ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యుడు విల్సన్ డిమాండ్ చేశారు. శాస్త్రీయ ప్రణాళిక లేకుండా జనగణన నిర్వహిస్తే.. సన్సెస్‌‌‌‌ కోసం కేంద్ర ఖర్చు చేసే సుమారు రూ.12,800 కోట్ల ప్రజాధనంతో పాటు సమయం వృథా అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత విధానంలోనే జనగణన కొనసాగిస్తే, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడ్తామని హెచ్చరించారు.