- చట్టవిరుద్ధ పనులు చేయాలని వేధిస్తోంది: అఖిలేష్ యాదవ్
- ఐఏఎస్ దివ్య మిట్టల్ రాజీనామా వెనుక కారణాలివేనంటూ ట్వీట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై బీజేపీ ప్రభుత్వం అనైతిక, చట్టవిరుద్ధ పనులు చేసేలా ఒత్తిడి తెస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆదివారం ‘ఎక్స్’లో వరుస పోస్టులు పెట్టిన ఆయన.. ప్రభుత్వ తీరుపై ఫైర్అయ్యారు. కమీషన్ల ద్వారా అవినీతికి పాల్పడాలని, బీజేపీ కార్యకర్తలకు మేలు చేసేలా టెండర్లను మేనేజ్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. బదిలీలు, పోస్టింగ్‌లను వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, కస్టడీ మరణాల కేసులను అణచివేయడం, రాజకీయ ప్రత్యర్థులపై ఫేక్ ఎన్‌కౌంటర్లకు సహకరించడం వంటి పనులకు అధికారులను వాడుకుంటున్నారని ఆరోపించారు.
బీసీ, దళిత, మైనారిటీలపై అఘాయిత్యాల కేసులను తొక్కిపెట్టాలని, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అత్యాచారం, కిడ్నాప్ కేసులను అణచివేయడంతోపాటు బీజేపీ కార్యకర్తల ఆక్రమణలను కప్పిపుచ్చాలని హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. “ఇలాంటి ఒత్తిళ్ల వల్లే అధికారులు రాజీనామా చేయాల్సి వస్తోంది. నిజాయితీ గల అధికారుల్లేకుండా పాలన సాగదు” అని అఖిలేష్ పేర్కొన్నారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ ఆదివారం రాజీనామా చేయడంపై అసలు కారణాలు ఇవేనంటూ ఆయన ట్వీట్చేశారు. ప్రభుత్వం తన ఇమేజ్ పెంచుకోవడం కోసం రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, కానీ బీజేపీ గవర్నమెంట్ రూ. 70 వేల కోట్లు ఖర్చు చేసినా వారి ప్రతిష్ట మాత్రం ఎప్పటికీ పెరగదని ఎద్దేవా చేశారు.
