- నీటిలో మునిగి ఇద్దరు మృతి
- ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ లాల్ పల్లిలో ఘటన
ములుగు, వెలుగు : నీటి కుంటలో పడిన తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న సైతం నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్ లాల్ పల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులకు వినయ్ (15), రాజేశ్ (12) కుమారులు. రాఖీ పండుగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి గణేశ్ లాల్ పల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
పండుగ ముగియడంతో యాకూబ్, స్వాతి దంపతులు కమలాపురం వెళ్లిపోగా, శని, ఆదివారాలు సెలవు కావడంతో వినయ్, రాజేశ్ అమ్మమ్మ ఇంటి వద్దే ఉన్నారు. ఆదివారం ఉదయం బహిర్భూమి కోసమని ఇద్దరూ కలిసి గ్రామ సమీపంలోని మొండికుంట వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలో రాజేశ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గమనించిన వినయ్ తమ్ముడు రాజేశ్ ను కాపాడేందుకు నీటిలోకి దిగడంతో ఇద్దరూ మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు గమనించి కుంటలోకి దిగి ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.
