ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు కేసీఆర్ కు నక్కకు.. నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. చెంచాలు, చెప్పులు మోసిన వాళ్లకు కేసీఆర్ పదవులిస్తే..తాను బడుగు బలహీన వర్గాల వాళ్లకు పదవులిచ్చానని చెప్పారు రేవంత్.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంబర్‌పేట్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. మూసీ పక్కన నివసించే పేదల దయనీయ పరిస్థితిని పట్టించుకోలేదన్న ఆయన.. తాము మాత్రం ఎక్కడ ఉన్నవారికే అక్కడే ఇళ్లు కట్టించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక బతుకమ్మ కుంటను చెరబట్టిన వారి వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలకు తెలుసన్నారు.
బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని.. కేసీఆర్ చేసిన అప్పుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా ఏడున్నర వేల కోట్లు.. అంటే ఏడాదికి 83 వేల కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనపై కొందరు బురద జల్లాలని చూస్తున్నారని.. ఆడబిడ్డల చీరల మీద కమిషన్లు నొక్కేసే బీఆర్ఎస్ లీడర్లది ఓ బతుకేనా అంటూ ఫైర్ అయ్యారు ఆడబిడ్డల కళ్లలో వెలుగు చూసి ఓర్వలేకనే ఆటో డ్రైవర్లను ఉసిగొల్పుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రజాపాలనలో ఉద్యోగులకు ఒకటో తేదీనే, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఐదో తేదీనే జీతాలు ఇస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. ఫ్రీ బస్సు స్కీమ్ కింద ఆర్టీసీకి 11 వేల కోట్లు చెల్లించామని, మహిళల కోసం ఉచిత బస్సులతో పాటు పెట్రోల్ బంకులు, వెయ్యి బస్సులు కేటాయించామని తెలిపారు. ఇప్పటివరకు 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, కోటి 15 లక్షల కొత్త రేషన్ కార్డులు అందించామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, పెరుగుతున్న నగరానికి తగినట్లుగా మౌలిక వసతుల కల్పన జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఫ్యూర్, రేర్, క్యూర్ పేర్లతో నగర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు.
