Aakali Rajyam 2026 OTT Review: కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్‌తో 'ఆకలి రాజ్యం 2026'.. యూత్‌ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

Aakali Rajyam 2026 OTT Review: కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్‌తో 'ఆకలి రాజ్యం 2026'.. యూత్‌ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

‘ఆకలి రాజ్యం’... ఈ పేరు వినగానే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ బాలచందర్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ మూవీ గుర్తొస్తుంది. ఆ చిత్రంలోని నిరుద్యోగుల ఆకలి కష్టాలనే ప్రధాన కథాంశంగా తీసుకుని నేటి యువత ఎలాంటి అవరోధాలను ఎదుర్కొంటున్నారు అనే అంశంతో 'ఆకలి రాజ్యం 2026' ( Aakali Rajyam 2026 )వెబ్ సిరీస్ తెరకెక్కించారు. వికాస్ వశిష్ట, గీత్ సైనీ, రాజేష్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. టెలిఫ్యాక్టరీ బ్యానర్‌పై వంశీ కాంత్ రేవణ నిర్మించారు.  ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉందో చూద్దాం....

కథేంటంటే?.. 

బీటెక్‌ క్లాస్‌మేట్స్ అయిన రమేశ్ (వికాస్ వశిష్ట), అక్షయ్ (రాజేశ్ ఖన్నా), అరుణ (గీతా సైనీ) చదువు పూర్తి చేసుకుని, హైదరాబాద్‌లో ఉద్యోగాల వేటలో ఉంటారు. ఓ వైపు తమ క్వాలిఫికేషన్‌కు తగ్గ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ, అవి  రాకపోవడంతో, దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలతో వచ్చే సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతుంటారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన అరుణ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటే.. అక్షయ్, రమేష్ చిన్నా చితకా జాబ్స్ చేస్తుంటారు. ఇద్దరు అబ్బాయిలతో అరుణ రూమ్ షేర్ చేసుకోవడం పట్ల తన పేరెంట్స్‌ సహా పలువురు ఆమెను తప్పుబడతారు. బిలో మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్‌ నుంచి వచ్చిన ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య.

ఈ నేపథ్యంలో రమేష్‌ ఓ బిజినెస్‌ ప్రపోజల్ తీసుకొస్తాడు. ఇందుకోసం ముగ్గురు జాబ్‌లు వదిలేసి అప్పు చేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో ముగ్గురి మధ్య విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు ఎలా పరిష్కారం అయ్యాయి..? నిరాశ, నిస్పృహల్లో ఉన్న ఈ ముగ్గురు నిరుద్యోగులు తమ జీవితాల్లో సక్సెస్ అయ్యేందుకు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు అనేది మిగతా కథ...

ఎవరెలా చేశారంటే..?

లీడ్ రోల్స్‌లో నటించిన వికాస్ వశిష్ట, గీత్ సైని, రాజేష్ ఖన్నా ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. నిరుద్యోగుల జీవితాల్లోని ఎమోషన్స్‌ను సహజంగా పండించి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇంటి ఓనర్‌‌ బిట్టుబాయ్‌గా రమేష్‌ ఈరావేన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతర నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించినప్పటికీ నిర్మాణ విలువలు బాగున్నాయి. హైదరాబాద్‌లోని రియల్ లోకేషన్స్‌లో చిత్రీకరించడం, సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌‌ పర్వాలేదు. ల్యాగ్ సీన్స్‌ ఇంకాస్త ఎడిట్ చేసుంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది.. 

ఎలా ఉందంటే..? 

కమల్ హాసన్ 'ఆకలి రాజ్యం' మూవీ వచ్చి నాలుగున్నర దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలో ఎలాంటి మార్పులేదు. కాలం మారుతున్న కొద్ది నిరుద్యోగులకు కొత్త కష్టాలు పుట్టుకొచ్చాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్ కాలేజీల్లో సరైన నాణ్యత లేని విద్యా ప్రమాణాల కారణంగా..  ప్రతిఏటా లక్షలాది మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. కానీ వారిలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదు. దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. చిన్న చితకా ఉద్యోగాలు చేస్తూ బతుకీడుస్తున్నారు. సరిగ్గా ఇదే సమస్యను ముగ్గురి జీవితాలతో ముడిపెట్టి ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. 

ప్రస్తుతానికి మూడు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రిమింగ్‌లోకి తెచ్చారు. తొలి రెండు ఎపిసోడ్స్‌లో నిరుద్యోగుల ఆర్థిక ఇబ్బందులకు కామెడీ జోడించి ఎంటర్‌‌టైన్‌ చేశారు దర్శకుడు నీలగిరి మామిళ్ల. మూడో ఎపిసోడ్‌ నుంచి ఎమోషనల్ టర్న్‌ తీసుకున్నాడు. ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న సమస్యను సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఇంకాస్త బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా ఉండాల్సిందనే అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.  కొన్ని సీన్స్‌ సాగతీతగా అనిపించినా, ముగ్గురు స్నేహితుల మధ్య బాండింగ్‌, ఎమోషనల్ సీన్స్‌ వర్కవుట్ అయ్యాయి. 

యూత్‌కు కనెక్ట్ అయ్యేలా..

ఇక వచ్చే ఎపిసోడ్స్‌లో ఈ కథను ఎలా నడిపిస్తారనే దానిపైనే పూర్తి విజయం ఆధారపడి ఉంది. మూడో ఎపిసోడ్ చివరలో స్టోరీ సిటీ నుంచి విలేజ్‌కు మారబోతోందని, స్మార్ట్ ఫార్మింగ్‌ చేయబోతున్నారని లీడ్ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి చదువు పూర్తి చేసుకుని నిరుద్యోగ సమస్యతో బాధ పడే యువతీయువకుల జీవితాన్ని ఈ సిరీస్‌లో చూపించారు. దీంతో యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.  పాత కథనే తీసుకున్నా ఎమోషనల్ టచ్‌తో తర్వాతి ఎపిసోడ్స్‌పై ఆసక్తి రేపడం బాగుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 28వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.