రూ.11 లక్షల ప్యాకేజీతో హైదరాబాద్‌లో బ్యాక్‌ఎండ్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఒక టెక్కీ.. విదేశాలకు వెళ్లాలా వద్దా అనే డైలమాలో పడ్డాడు. జస్ట్ ఏడాది ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ టెక్కీకి.. తన తండ్రి విదేశాల్లో కెరీర్ బిల్డ్ చేసుకోవటానికి ఏకంగా రూ. 30 లక్షలు ఇస్తానని ముందుకు రావడంతో సోషల్ మీడియా వేదికగా సలహా కోరాడు. 'మై ఫాదర్ ఆస్కింగ్ మీ టూ లీవ్ ఇండియా అండ్ ఆఫరింగ్ 30 లాక్స్' పేరుతో రెడ్దిట్‌లో పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తమ ఫ్యామిలీలో ఇప్పటికే బంధువులు, కజిన్స్ విదేశాల్లో స్థిరపడ్డారని ఆ టెక్కీ తన పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇక్కడి సమాజంతో విసిగిపోయానని.. ఎలాగైనా భవిష్యత్తులో విదేశాల్లోనే సెటిల్ కావాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తన అన్నయ్య విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. తండ్రి తనను వెళ్లాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పాడు సదరు టెక్కీ. రూ.30 లక్షలు తండ్రి ఇస్తారని.. మిగతా డబ్బును తానే సర్దుబాటు చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లాన్ కూడా వెల్లడించాడు.
తన పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నాడు ఈ హైదరాబాద్ టెక్కీ. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, యూకే, కెనడా, అమెరికాలపై దృష్టి పెట్టానని.. అయితే అమెరికాను మాత్రం తన 'చివరి ఆప్షన్'గా ఉన్నట్లు చెబుతున్నాడు. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయడం బెస్ట్ ఛాయిస్ భావిస్తున్నప్పటికీ.. ఇప్పుడే వెళ్లాలా లేక మరో రెండేళ్లు అనుభవం సంపాదించాక వెళ్లాలా అనే దానిపై స్పష్టత లేదంటూ సలహాలు కోరాడు నెటిజన్ల నుంచి.
ఈ పోస్ట్‌పై ఇంటర్నెట్ వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కెనడాలో ప్రస్తుతం పీఆర్ రావడం చాలా కష్టమని, AI ప్రభావంతో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఒకరు హెచ్చరించారు. మరో యూజర్ స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో ఉంటే, భారతదేశంలో మరో రెండేళ్లు మంచి అనుభవం సంపాదించి ఆ తర్వాత మంచి యూనివర్సిటీకి వెళ్లడం మేలని సలహా ఇచ్చారు. మరికొందరు మాత్రం విదేశాల్లో ప్రస్తుత పరిస్థితులు బాగోలేవని.. ఇక్కడే సరైన ప్లానింగ్ చేసుకోవటం మంచిదని సూచించారు.
