రూ.7 వేల పెట్రోల్ బిల్లు కట్టించి.. పిల్లలకు డబ్బు విలువ చెప్పిన సెహ్వాగ్!

రూ.7 వేల పెట్రోల్ బిల్లు కట్టించి.. పిల్లలకు డబ్బు విలువ చెప్పిన సెహ్వాగ్!

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన పిల్లల పెంపకం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పిల్లలు ఖరీదైన లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడేకంటే ముందు.. సంపాదన విలువను తెలుసుకోవాలని అన్నారు. డిజిటల్ క్రియేటర్ నేహా బేడి నిర్వహించిన 'ది లైఫ్ సేవర్స్ షో'లో సెహ్వాగ్ ఈ విషయాలు వెల్లడించారు.

ప్రస్తుతం సెహ్వాగ్ కుమారులు అండర్-16, అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడుతూ సొంతంగా రూ.2 నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఒకసారి కారులో పెట్రోల్ కొట్టించినప్పుడు బిల్లు రూ.7వేలు అయింది. తండ్రి డబ్బుతో చెల్లించినప్పుడు వాళ్లు తేలిగ్గా తీసుకున్నాడు. కానీ ఆ మొత్తాన్ని స్వయంగా తన డబ్బుతో చెల్లించాల్సి వచ్చినప్పుడు వారిలో మార్పు వచ్చిందన్నారు సెహ్వాగ్. ఈ చిన్న సంఘటనే పిల్లలకు ఖర్చుల విలువను, డబ్బంటే ఏంటో నేర్పడానికి ఒక మంచి అవకాశమని సెహ్వాగ్ పేర్కొన్నారు.

పిల్లలకు బ్రాండెడ్ వాచీలు, లగ్జరీ కార్లు వంటి వస్తువుల పట్ల ఆకర్షణ ఉండటం సహజమేనని సెహ్వాగ్ తెలిపారు. అయితే జస్ట్ షోఆఫ్ కోసం బతికే 'దిఖావా' లైఫ్ కంటే.. ఏదైనా సాధించి పది మంది చేత 'వావ్' అనిపించుకునే నిజమైన జీవితం చాలా గొప్పదని తన కొడుకులకు హితవు చెప్పారు. కేవలం షోఆఫ్ వల్ల వచ్చే గుర్తింపు శాశ్వతం కాదని.. మనం చేసే పనుల ద్వారానే నిజమైన గౌరవం లభిస్తుందని సెహ్వాగ్ నమ్ముతున్నారు.

ALSO READ : చదువుకు వయసుతో పనేంటి? 

ఇక క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. తన ఇంటిపేరు కారణంగా భవిష్యత్తులో పోలికలు, విమర్శలు సర్వసాధారణమని సెహ్వాగ్ ముందే చెప్పారు. తండ్రితో పోల్చుతూ వచ్చే విమర్శలను పట్టించుకోకుండా, కేవలం తమ ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఏనుగు మొరిగే కుక్కలను పట్టించుకోనట్లే, బయటి మాటలను లెక్క చేయకుండా తమ లక్ష్యం వైపు ముందుకు సాగాలని పిల్లలకు ధైర్యం నింపారు సీనియర్ క్రికెటర్. పిల్లల పెంపకంలో డబ్బు విలువ, ఒత్తిడిని తట్టుకోవడం ఎంత ముఖ్యమో సెహ్వాగ్ చెప్పిన ఈ మాటలు ఇప్పటి పేరెంట్స్‌కి ఆదర్శంగా నిలుస్తున్నాయి.